ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల బోధనకు ప్రత్యేక దృష్టి.. ‘లెర్న్ ఇంగ్లీష్’ పుస్తకంతో సులభంగా అభ్యాసం
డోర్నకల్, ప్రభ న్యూస్,సెప్టెంబర్ 22 :
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి ఆంగోత్ లక్ష్మానాయక్ సూచించారు. మంగళవారం డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంఈఓ ఆంగోత్ లక్ష్మానాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్ల భాషను సులభమైన పద్ధతిలో నేర్చుకునేలా జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగా రూపొందించిన ‘లెర్న్ ఇంగ్లీష్’ పుస్తకాలను జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు అందజేసినట్లు పేర్కొన్నారు.ఈ పుస్తకాన్ని ఉపాధ్యాయులు పకడ్బందీగా వినియోగిస్తూ విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై అవగాహన, ఆసక్తి పెంపొందించేలా బోధన సాగించాలని సూచించారు.
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు డి. పద్మ, అసిస్టెంట్ సెక్రటరీ జె. రాములు, జిల్లా ఎఫ్‌ఎల్‌ఎన్ ఆర్‌పీ టి. బాలాజీతో పాటు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు తదితరులు పాల్గొన్నారు.


