Last Updated:
తిరుమలలో “నిత్య హారతి దర్శనం” పేరుతో ఎలాంటి ప్రత్యేక సేవ లేదని టీటీడీ స్పష్టం చేసింది. కర్ణాటక సీఎం వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ, భక్తులు అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచించింది. మరోవైపు దాతల కోసం కొత్త డోనర్ పాలసీని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు సంబంధించిన అంశాలపై కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ, తిరుమలలో “నిత్య హారతి దర్శనం” పేరుతో ఎలాంటి ప్రత్యేక దర్శన విధానం లేదని స్పష్టం చేశారు. సరైన అవగాహన లేకుండానే ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని భావిస్తున్నామని ఆయన తెలిపారు. భక్తుల్లో అపోహలు కలిగించేలా వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంటూ, తిరుమలలో అమలులో ఉన్న సేవలు, దర్శనాలపై అధికారిక సమాచారాన్నే ప్రజలు నమ్మాలని సూచించారు.
ఈ వివరణకు కారణమైన అంశం ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన ప్రకటన. బెంగళూరులోని బనశంకరిలో శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తిరుమలలో ప్రతిరోజూ నిర్వహించే తొలి హారతిని కర్ణాటకకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఇతర ప్రముఖులు ప్రోటోకాల్ ప్రకారం వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన అధికారిక ప్రోటోకాల్ ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని కూడా ప్రకటించారు.
అయితే టీటీడీ మాత్రం ఈ ప్రకటనపై స్పష్టత ఇచ్చింది. తిరుమలలో “నిత్య హారతి దర్శనం” అనే పేరుతో ఎలాంటి దర్శన సేవ లేదని, అందువల్ల అలాంటి వ్యాఖ్యలు భక్తులను తప్పుదారి పట్టించే అవకాశముందని పేర్కొంది.
తిరుమల ఆలయ చరిత్రలో కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. దాదాపు 400 సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం విజయనగర సామ్రాజ్య పాలకులు, అనంతరం మైసూరు వొడయార్ రాజవంశం తిరుమల దేవస్థానానికి బంగారు ఆభరణాలు, భూములు, నిత్యపూజలకు అవసరమైన సామగ్రిని విరాళంగా సమర్పించాయి.
ఆలయంలో నిత్యపూజల నిర్వహణలో మైసూరు సంస్థానం కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, ప్రతి ఉదయం స్వామివారికి సమర్పించే తొలి హారతిని స్వీకరించే గౌరవం మైసూరు రాజవంశానికి లభించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తోందని చారిత్రక సమాచారం చెబుతోంది. అయితే ఈ సంప్రదాయానికి సంబంధించి అమలులో ఉన్న విధానాలపై అధికారిక వివరాలే ప్రామాణికమని టీటీడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక మరోవైపు టీటీడీ దాతలకు సంబంధించిన సౌకర్యాల్లో కీలక మార్పులు చేపట్టింది. టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ముద్దాడ రవిచంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం, సామాన్య భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాతలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను హేతుబద్ధీకరిస్తూ కొత్త డోనర్ పాలసీని అమలు చేస్తున్నారు.
ఈ కొత్త విధానం మంగళవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే టీటీడీకి విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమల్లో ఉన్న సౌకర్యాల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. కొత్త పాలసీ ప్రధానంగా భవిష్యత్తులో అమలయ్యే విధానాలకు సంబంధించినదేనని పేర్కొన్నారు.
టీటీడీకి వివిధ ట్రస్టుల ద్వారా ప్రస్తుతం సుమారు 1.90 లక్షల మంది దాతలు ఉన్నారు. వీరిలో సుమారు 22 వేల మంది రూ.10 లక్షల విరాళం కేటగిరీలో ఉన్నట్లు ఈఓ వెల్లడించారు. గడిచిన నాలుగు నెలల్లోనే మరో 2 వేల మంది ఈ కేటగిరీలో చేరినట్లు తెలిపారు. పెరుగుతున్న దాతల సంఖ్య, సాధారణ భక్తుల దర్శన సౌకర్యాలను సమతుల్యం చేయాలనే ఉద్దేశంతోనే కొత్త డోనర్ పాలసీని రూపొందించినట్లు టీటీడీ వెల్లడించింది.
Hyderabad,Telangana

