Last Updated:
సౌదీ అరేబియాకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు కీలక సమాచారం. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు తమ నిర్ణయాలను మరోసారి మార్చుకున్నాయి.
పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు విమాన ప్రయాణాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు కీలక సమాచారం వెల్లడించాయి. భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తమ విమాన సర్వీసుల రద్దును అక్టోబర్ 24, 2026 వరకు పొడిగించాయి. ఇప్పటికే ఇండిగో, ఆకాశ ఎయిర్ కూడా సౌదీ అరేబియాలోని పలు నగరాలకు విమానాల రద్దును ప్రకటించడంతో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మరోసారి పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శనివారం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జెడ్డా, రియాద్, దమ్మామ్ నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను అక్టోబర్ 24 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ఈ సమయంలో ప్రయాణికులకు సాధ్యమైనంత ఎక్కువ వెసులుబాటు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ప్రాంతీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
అంతకుముందు ఎయిర్ ఇండియా సౌదీ అరేబియాకు విమానాలను అక్టోబర్ 20 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తొలుత అక్టోబర్ 17 వరకు సర్వీసులను నిలిపివేసింది. తాజాగా పరిస్థితుల్లో మార్పులు లేకపోవడంతో ఈ గడువును అక్టోబర్ 24 వరకు పొడిగించాయి.
సౌదీ అరేబియాకు విమానాలను రద్దు చేసిన సంస్థల్లో ఇండిగో, ఆకాశ ఎయిర్ కూడా ఉన్నాయి. ఇండిగో గురువారం తన విమాన సర్వీసుల రద్దును అక్టోబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రియాద్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే అన్ని విమానాలను అక్టోబర్ 24 వరకు నిలిపివేస్తున్నట్లు ఆకాశ ఎయిర్ గురువారం తెలిపింది. జెడ్డా సర్వీసులను మాత్రం అక్టోబర్ 21 వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆయా నగరాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు విమానయాన సంస్థల తాజా ప్రకటనలను గమనించడం అవసరం.
సౌదీ అరేబియాలోని పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. రియాద్ విమానాశ్రయం కూడా ఈ దాడుల లక్ష్యాల్లో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో భద్రతాపరమైన పరిస్థితులు అనిశ్చితంగా ఉండటంతో విమానయాన సంస్థలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.
సౌదీ అరేబియాకు ప్రయాణించాల్సిన వారు టికెట్ వివరాలు, విమానాల తాజా స్థితిని సంబంధిత సంస్థల అధికారిక వేదికల్లో పరిశీలించి, తదనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలి.

