Last Updated:
పెట్రోల్ బంకుల్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేస్తున్నారా? అయితే డిసెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల గురించి తప్పక తెలుసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం. ఇంధనం, రవాణా సంబంధిత చెల్లింపులపై అదనపు ఛార్జీలు విధించేలా ఎస్బీఐ కార్డ్ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ మార్పులు 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నిర్దేశించిన పరిమితులకు మించిన చెల్లింపులు చేసే కార్డుదారులు 1 శాతం అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే రవాణా, ఇంధన లావాదేవీలకు వేర్వేరు పరిమితులు వర్తిస్తాయి. ఈ వివరాలను ఎస్బీఐ కార్డ్ తన సమాచార ప్రకటనలో వెల్లడించింది.
కొత్త నిబంధనల ప్రకారం, రవాణా సేవలకు సంబంధించిన ఒక్కో లావాదేవీ విలువ రూ.30,000 దాటితే దానిపై 1 శాతం అదనపు ఛార్జీ విధిస్తారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. ఈ పరిమితిని నెలవారీ మొత్తం ఖర్చు ఆధారంగా కాకుండా, ఒక్కో లావాదేవీ ఆధారంగా లెక్కిస్తారు.
ఉదాహరణకు, ఎవరైనా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రవాణా సేవలకు రూ.35,000 చెల్లిస్తే, అదనంగా రూ.350 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒక్కో లావాదేవీ విలువ రూ.30,000 లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఈ కొత్త నిబంధన కింద అదనపు ఛార్జీ వర్తించదు. ఈ నిబంధన MCC 4111, 4784, 4131 కింద గుర్తించే లావాదేవీలకు వర్తిస్తుంది.
ఇంధన కొనుగోళ్లకు మాత్రం మరో విధమైన లెక్కింపు ఉంటుంది. ఒక బిల్లింగ్ సైకిల్లో కార్డుదారుడి మొత్తం ఫ్యూయల్ ఖర్చు రూ.50,000 దాటితే, మొత్తం ఇంధన వ్యయంపై 1 శాతం రుసుము విధిస్తారు. అంటే రూ.50,000కు మించిన మొత్తంపైనే కాకుండా, ఆ బిల్లింగ్ సైకిల్లో చేసిన మొత్తం ఇంధన చెల్లింపులపై ఛార్జీ లెక్కిస్తారు.
ఉదాహరణకు, ఒక నెల బిల్లింగ్ సైకిల్లో ఇంధనం కోసం రూ.60,000 ఖర్చు చేస్తే, మొత్తం మొత్తంపై 1 శాతం చొప్పున రూ.600 అదనంగా చెల్లించాలి. ఈ నిబంధన MCC 5172, 5541, 5542, 5983 కింద నమోదయ్యే ఇంధన లావాదేవీలకు వర్తిస్తుంది.
రవాణా చెల్లింపులకు ఒక్కో లావాదేవీ విలువను, ఇంధన కొనుగోళ్లకు బిల్లింగ్ సైకిల్లోని మొత్తం ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల అధిక మొత్తాల్లో చెల్లింపులు చేసేవారు తమ ఖర్చులను ముందుగానే పరిశీలించుకోవడం మంచిది.
అలాగే, వ్యాపారి వర్గాన్ని గుర్తించే MCC కోడ్లను చెల్లింపు నెట్వర్క్ భాగస్వాములు నిర్ణయిస్తారు. వారి నిర్ణయానుసారం ఈ కోడ్లు మారవచ్చని, అలాంటి మార్పులకు కార్డుదారులకు ప్రత్యేకంగా ముందస్తు సమాచారం ఇవ్వకపోవచ్చని ఎస్బీఐ కార్డ్ స్పష్టం చేసింది. కొత్త ఛార్జీలు 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

