నకిలీ సంతకం–అధికారిక సీల్‌తో సంక్షేమ పథకాల మోసం యత్నంప్రభుత్వ వైద్యుడి ఫిర్యాదుతో కేసు నమోదు.. సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ప్రభ న్యూస్, కామారెడ్డి జిల్లా , జూలై 22:
ప్రభుత్వ వైద్యుడి సంతకం, అధికారిక సీల్‌ను నకిలీ చేసి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అక్రమంగా పొందేందుకు ప్రయత్నించిన ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనపై ప్రభుత్వ వైద్యుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్‌ఎంఓ)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చందరి సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, జూలై 22న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో కొన్ని ధృవపత్రాలను పరిశీలించగా వాటిపై ఉన్న సంతకాలు తనవి కాదని గుర్తించారు. అంతేకాకుండా తన అధికారిక సీల్‌ను కూడా అనుమతి లేకుండా నకిలీ చేసి వినియోగించినట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ నకిలీ ధృవపత్రాలను కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు వినియోగించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వ రికార్డుల విశ్వసనీయత దెబ్బతినడంతో పాటు ప్రభుత్వ వైద్యుడి వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదులో వివరించారు.ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి, నకిలీ సంతకాలు చేసిన వ్యక్తులు, అధికారిక సీల్‌ను దుర్వినియోగం చేసిన వారు, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతరులను గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.పట్టణ సీఐ నరహరి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోందని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

