Last Updated:
రష్యాకు చెందిన వేల కోట్ల ఇంధన ఆస్తుల విక్రయ ఒప్పందంలో ట్రంప్ ప్రభుత్వం దళారీగా వ్యవహరిస్తోందని, దీనివల్ల ట్రంప్ కుటుంబ సన్నిహితులు లబ్ధి పొందుతున్నారని అమెరికా డెమొక్రాటిక్ సెనేటర్ జోన్ ఓసాఫ్ సంచలన ఆరోపణలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారుపై డెమొక్రాటిక్ సెనేటర్ జోన్ ఓసాఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రష్యాకు చెందిన వేల కోట్ల డాలర్ల ఇంధన ఆస్తుల విక్రయ లావాదేవీల్లో ట్రంప్ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహిస్తోందని, ఈ డీల్ వల్ల ట్రంప్ కుటుంబంతో ఆర్థిక సంబంధాలు ఉన్న వ్యక్తులకు భారీగా లాభం చేకూరుతోందని ఆరోపించారు. అట్లాంటాలో జరిగిన ప్రచార ర్యాలీలో మాట్లాడిన ఆయన, మాస్కో నుంచి డీజిల్ కొనుగోలు చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో రష్యా చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, పెట్రోల్ బంకులను ట్రంప్ ఎన్నికల ప్రచారానికి నిధులు సమకూర్చిన సన్నిహితులకు విక్రయించేలా వైట్‌హౌస్ పావులు కదుపుతోందని నిప్పులు చెరిగారు. అమెరికా ప్రభుత్వం పూర్తి మద్దతుతోనే ఈ చీకటి ఒప్పందం నడుస్తోందని మండిపడ్డారు.
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. రష్యన్ చమురు దిగ్గజం ‘లుకోయిల్’ అంతర్జాతీయ ఆస్తుల విక్రయంపై వాషింగ్టన్, మాస్కో మధ్య కీలక చర్చలు జరుగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ రహస్య మంతనాల్లో ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కీలకంగా వ్యవహరిస్తున్నారని ఓసాఫ్ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కుష్నర్, విట్కాఫ్ స్వయంగా చర్చలు జరుపుతూ రష్యా చమురు నిల్వలను తమ మిత్రులకు కట్టబెడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ ప్రభుత్వంలోని ఇతర ముఖ్యులపైనా ఓసాఫ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కజకిస్తాన్‌లోని మైనింగ్ ప్రయోజనాల కోసం విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రజల సొమ్ము నుంచి 1.6 బిలియన్ డాలర్లు కేటాయించారని విమర్శించారు. ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పెట్టుబడులకు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పెంటగాన్ నిధులను మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. వెనిజులా చమురు నిధులు ఖతార్ బ్యాంకుల్లోకి మారుతున్నాయని ఆరోపించినప్పటికీ, వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలను ఆయన బహిర్గతం చేయలేదు.
ఎలైట్స్ సంస్కృతిని ద్వేషిస్తున్నట్లు నాటకమాడుతున్న ట్రంప్ బృందం స్వయంగా వారేనని ఓసాఫ్ దుయ్యబట్టారు. ఈ అక్రమ లావాదేవీలపై వచ్చే ఏడాది అమెరికా కాంగ్రెస్ కమిటీ ముందు విచారణ తప్పదని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ఎదుట చేతులు పైకెత్తి నిజాలు ఒప్పుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జార్జియాలో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓసాఫ్ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

