మధ్యప్రదేశ్లోని ఖర్గోన్కు చెందిన ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ సంతోష్ మౌర్య (MD) తెలిపిన వివరాల ప్రకారం.. చలికాలంలో ఆహారం, వ్యాయామం, శరీరానికి మసాజ్, నిద్ర వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. క్రమబద్ధమైన జీవనశైలి పాటించడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.
ఉదయం త్వరగా నిద్రలేవాలి: ఆయుర్వేదంలో బ్రహ్మ ముహూర్తానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉదయం 4 నుంచి 4.30 గంటల మధ్య నిద్రలేవడం మంచిదని సూచిస్తారు. అయితే చలికాలంలో వాతావరణ పరిస్థితులను బట్టి సూర్యోదయానికి ముందుగా నిద్రలేవవచ్చు. నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి. సూర్యరశ్మి వచ్చిన తర్వాత తేలికపాటి వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. వీటివల్ల శరీరంలో చురుకుదనం పెరిగి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది.
స్నానానికి ముందు నూనెతో మసాజ్: చలికాలంలో చర్మం పొడిబారడం, వృద్ధుల్లో కీళ్ల నొప్పులు, శరీర బిగుతు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో స్నానానికి ముందు నువ్వుల నూనె లేదా ఆవాల నూనెతో తేలికగా మసాజ్ చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల చర్మానికి తేమ అందడంతో పాటు శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. మరీ చల్లటి నీటిని ఉపయోగించకుండా ఉండటం మంచిది.
ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య అల్పాహారం: రోజంతా శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో అల్పాహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చలికాలంలో వేడిగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. ఉప్మా, పోహా, దలియా, పెసరపప్పు అట్లు, పాలు వంటి వాటిని అల్పాహారంగా తీసుకోవచ్చు. వీటితో పాటు బాదం, వాల్నట్స్, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కూడా మంచిది.
మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య భోజనం: ఆయుర్వేదం ప్రకారం మధ్యాహ్నం సమయంలో జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుందని చెబుతారు. ఈ సమయంలో ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారం తీసుకోవాలి. రొట్టెలు, అన్నం, పప్పు, కాలానుగుణ కూరగాయలు, నెయ్యి, మజ్జిగను అవసరానికి తగిన మోతాదులో ఆహారంలో చేర్చుకోవచ్చు. చలికాలంలో సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలతో చేసిన రొట్టెలు కూడా మంచి ఎంపికలు.
సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య చిరుతిండి: సాయంత్రం ఆకలిగా అనిపించినప్పుడు చాలామంది టీతో పాటు నూనెలో వేయించిన పదార్థాలు తింటుంటారు. వాటికి బదులుగా పండ్లు, వేయించిన శనగలు, మఖానా, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తిని అందిస్తాయి.
రాత్రి 6 నుంచి 7 గంటల మధ్య భోజనం: రాత్రి భోజనం తేలికగా, సులభంగా జీర్ణమయ్యేలా ఉండాలని డాక్టర్ మౌర్య సూచిస్తున్నారు. కూరగాయల కూర, పప్పు, రొట్టెలు వంటి ఆహారాన్ని తీసుకోవచ్చు. రాత్రి ఆలస్యంగా ఎక్కువ మొత్తంలో భోజనం చేయకూడదు. తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం మంచిది. అలాగే రాత్రి 10 గంటలలోపు నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఆలస్యంగా మొబైల్ ఫోన్, టీవీ చూడటం తగ్గించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చు.
చలికాలంలో ఈ అలవాట్లను పాటించడంతో పాటు తగినంత నీరు తాగడం, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఆహారం తీసుకోవడం ముఖ్యం. అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి.
