గ్రామ అభివృద్ధే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా కురువ మల్లేశ్వరి నామినేషన్!
గత పాలకుల పాలనను చూశారు.. ఈసారి గ్రామ అభివృద్ధికి తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి
ప్రభ న్యూస్, కౌతాళం, కర్నూల్ జిల్లా, నవంబర్ 20 :
కౌతాళం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా కురువ నాగిరెడ్డి సతీమణి కురువ మల్లేశ్వరి నిలిచారు. గ్రామ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని నవంబర్ 19వ తేదీ గురువారం ఆమె సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా కురువ మల్లేశ్వరి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు గతంలో పాలకుల పాలనను చూశారని, గ్రామంలో ఇప్పటికీ పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి తనకు ఒక అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణతో పాటు గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
గ్రామంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని, ప్రజల అభిప్రాయాలకు విలువనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా గ్రామ ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని, ప్రజలు తనకు మద్దతుగా నిలిచి అమూల్యమైన ఓటుతో గెలిపించాలని కురువ మల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు.

