గంజాయి అక్రమ రవాణాపై గోకవరం పోలీసుల ఉక్కుపాదం.. 14 కిలోలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
గోకవరం, ప్రభ న్యూస్,అక్టోబర్ 17 :
గంజాయి అక్రమ రవాణాపై గోకవరం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గోకవరం ఎస్ఐ బి. నాగమణి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తంటికొండ ఆర్చ్ సమీపంలోని ఎన్‌హెచ్-516ఈ జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, రంపచోడవరం నుంచి రాజమండ్రి వైపు నీలం రంగు యమహా మోటార్‌సైకిల్‌పై తెల్లని గోనె సంచిలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి వెనక్కి తిరిగి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. డిప్యూటీ తహసీల్దార్ సమక్షంలో ఎలక్ట్రానిక్ తూకం యంత్రంతో తూకం వేయగా 14 కిలోల గంజాయి ఉన్నట్లు నిర్ధారించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పలపాటి నరేంద్ర (25), ఒంగోలు పట్టణానికి చెందిన బాలస్వామి వెంకటేష్ (36)గా గుర్తించారు. ప్రాథమిక విచారణలో గంజాయిని సేకరించి ఒంగోలు వైపు తరలిస్తున్నట్లు వారు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అక్రమ రవాణాలో ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ పవన్ కుమార్ వెల్లడించారు.

