Last Updated:
తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో వీబీ-జీ రామ్‌జీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో నిర్వహించిన ‘వీబీ-జీ రామ్‌జీ’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమరావతి గురించి ఎవరెన్ని విమర్శలు చేసినా అది దేవతల రాజధానిగా కొనసాగుతుందని, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనతో ప్రజలను అయోమయానికి గురి చేశారని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం “మావిగన్” అంటూ కొత్త వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని మరోసారి స్పష్టం చేస్తూ, వైసీపీ నేతల తీరుకు తగిన సమాధానం కాలమే చెబుతుందని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని సీఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి నిరంతరం విడుదల అవుతున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.
విశాఖపట్నం రైల్వే జోన్ సాధించడం, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించేందుకు కేంద్రం సహకారం అందించడం వంటి కీలక విజయాలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. గూగుల్ డేటా సెంటర్‌తో పాటు తిరుపతిలో బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ యూనిట్ వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తుండటం అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 93 కేంద్ర పథకాలను తమ కూటమి ప్రభుత్వం తిరిగి అమల్లోకి తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. జల్ జీవన్ మిషన్ సహా వివిధ కేంద్ర పథకాల అమలుకు రూ.28 వేల కోట్లకు పైగా వ్యయం చేస్తున్నామని వివరించారు.
ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, గ్రామీణ పేదరిక నిర్మూలనే ‘వీబీ-జీ రామ్‌జీ’ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ పథకం అమలుకు దేశవ్యాప్తంగా రూ.7.5 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామానికి ఉపాధి కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల వరకు నిధులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కూలీలకు వేతనాలు ఆలస్యం కాకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానికంగానే నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించడం ద్వారా గ్రామ స్వయంపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ‘వికసిత్ భారత్ జీ రామ్‌జీ’ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఉపాధి హామీ కింద శ్రామికులకు అదనంగా 25 రోజుల పని కల్పించడం ఈ పథకంలోని ముఖ్యమైన అంశమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం అమలుకు రూ.12,845 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత రెండేళ్లలో ‘పల్లె పండుగ’ వంటి కార్యక్రమాల ద్వారా రూ.16,695 కోట్ల ఉపాధి నిధులను వినియోగించినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 15,500 పశువుల నీటి తొట్టెలు నిర్మించినట్లు వివరించారు. వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల విరామం ఇవ్వడం వల్ల రైతులకు, వ్యవసాయ పనులకు అవసరమైన శ్రామికుల కొరత తలెత్తకుండా ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Hyderabad,Telangana

