భారత ప్రభుత్వ వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2026 జూలై 13 రాత్రి నుంచి జూలై 20 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నప్పటికీ, తొలి రెండు రోజులు ప్రధానంగా బలమైన ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కానీ ఎండలు కూడా బలంగా ఉండే అవకాశం ఉంది. జూన్ నెల సగం గడిచినా ఇంకా రాష్టంలో ఒక్క పెద్ద భారీ వర్షం లేదు. చెరువుల్లో నీళ్లు లేవు. ఏ వాగులు ఉప్పొంగడం లేదు. రైతులు ఆందోళనలో ఉన్నారు.
జూలై 13 రాత్రి నుంచి జూలై 15 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. అనంతరం జూలై 15 నుంచి జూలై 20 వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో సాధారణ ఈదురుగాలులు కొనసాగుతాయని పేర్కొంది.
ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రం విడుదల చేసిన అంచనాల ప్రకారం, 2026 జూలై 13 నుంచి జూలై 20 వరకు ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. జూలై 13 నుంచి 16 వరకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండనుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండగా, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచనున్నాయి. రాయలసీమలో ఎండలతో పాటు తీవ్ర ఉక్కపోత ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.
జూలై 16 నుంచి 18 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయినప్పటికీ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగనున్నాయి. జూలై 18 నుంచి 20 వరకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఈ కాలంలో ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు ఏవీ జారీ చేయలేదు.
ఈ వాతావరణ మార్పులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలపై ప్రభావం చూపనున్నాయి. ఎండలు, వడగాల్పులు, ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్న సమయంలో అనవసర ప్రయాణాలు తగ్గించాలని, బలమైన గాలుల సమయంలో తాత్కాలిక షెడ్లు, చెట్ల కింద వాహనాలు నిలపకూడదని అధికారులు సూచించారు. అలాగే తాజా వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవడానికి IMD అందిస్తున్న మౌసమ్, దామిని, మేఘదూత్ యాప్‌లను వినియోగించాలని ప్రజలకు సూచించారు.
