Last Updated:
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కేజీబీ ఏజెంట్‌గా కెరీర్ ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో భారత్, రష్యా మధ్య రక్షణ, వాణిజ్య, అంతరిక్ష రంగాల్లో వ్యూహాత్మక బంధం మరింత బలపడింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. 1952లో లెనిన్‌గ్రాడ్‌లో జన్మించారు. లెనిన్‌గ్రాడ్ స్టేట్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివారు. ఆ తర్వాత ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ కూడా చేశారు. పుతిన్ తన కెరీర్‌ను సోవియట్ యూనియన్‌కు చెందిన కేజీబీ అనే భద్రతా, నిఘా సంస్థలో ప్రారంభించారు. 1980ల చివర్లో కొంతకాలం తూర్పు జర్మనీలో పనిచేశారు. ఆ తర్వాత లెనిన్‌గ్రాడ్‌కు తిరిగి వచ్చి.. అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలు చేపట్టారు. తర్వాత స్థానిక రాజకీయాల్లోకి వచ్చిన పుతిన్.. సెయింట్ పీటర్స్‌బర్గ్ నగర పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించారు.

