భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో మౌలిక సదుపాయాలను వేగంగా ఆధునీకరిస్తోంది. ఇందులో రవాణా వ్యవస్థకు, ముఖ్యంగా రైల్వేలకు కీలక స్థానం ఉంది. భారతీయ రైల్వేలు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వేగం, భద్రత, సౌకర్యం, అందుబాటు ధరలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నాయి. వాటిలో వందే భారత్ ఎక్స్ప్రెస్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ముఖ్యమైనవి. రెండు రైళ్లూ ఆధునిక సాంకేతికత, మెరుగైన భద్రత, ప్రయాణ సౌకర్యాలను అందిస్తున్నప్పటికీ, వాటి లక్ష్య ప్రయాణికులు, ఛార్జీలు, కోచ్ల కూర్పు, సౌకర్యాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతదేశంలోనే డిజైన్ చేసి తయారు చేసిన సెమీ హైస్పీడ్ ట్రైన్సెట్. ప్రధానంగా ఇంటర్సిటీ ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ప్రయాణికులకు ఆధునిక రైలు అనుభవాన్ని అందించడం దీని లక్ష్యం. సాధారణ రైళ్లలో ఉండే ఇంజిన్-కోచ్ల విధానానికి భిన్నంగా, ఇందులో ఇంటిగ్రేటెడ్ ట్రైన్సెట్ టెక్నాలజీని ఉపయోగించారు. దీంతో వేగవంతమైన యాక్సిలరేషన్, మెరుగైన నిర్వహణ సామర్థ్యం, సాఫీ ప్రయాణానికి అవకాశం ఏర్పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

