Last Updated:
US Nuclear Lab Fire: అమెరికా అణ్వాయుధాలకు అవసరమైన కీలక సామగ్రిని ఉత్పత్తి చేసే సౌత్ కరోలినాలోని ఓ ప్రముఖ అణు ప్రయోగశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనతో అప్రమత్తమైన అత్యవసర బృందాలు రంగంలోకి దిగి మంటలను వేగంగా అదుపు చేశాయి. సీఎన్ఎన్ కథనం ప్రకారం.. ప్రమాదం జరిగినప్పటికీ ల్యాబ్ వెలుపలికి ఎటువంటి రేడియోధార్మిక కాలుష్యం లేదా వ్యర్థాలు వ్యాపించలేదని సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి. యూఎస్ ఇంధన శాఖ పరిధిలోని ‘సవన్నా రివర్ సైట్’ (Savannah River Site) ప్రాంగణంలో ఉన్న సవన్నా రివర్ నేషనల్ లాబొరేటరీలో బుధవారం సాయంత్రం 5:39 గంటలకు ఎమర్జెన్సీ ప్రకటించారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రయోగశాల ప్రవేశ మార్గాల వద్ద రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో రైలు, జల రవాణా, విమాన రాకపోకలపై తాత్కాలిక పరిమితులు విధించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అత్యవసర సహాయక చర్యల్లో లేని ఇతర సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏవైనా మార్గదర్శకాలు లేదా జాగ్రత్తలు పాటించాల్సి వస్తే తెలుసుకునేందుకు స్థానిక వార్తలను గమనిస్తూ ఉండాలని పరిసర ప్రాంతాల ప్రజలకు తొలుత అధికారులు సూచించారు. అనంతరం పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడంతో రాత్రి 9:45 గంటల ప్రాంతంలో ఎమర్జెన్సీని అధికారికంగా రద్దు చేశారు. తదుపరి షిఫ్ట్ ఉద్యోగులు యథావిధిగా విధులకు హాజరు కావచ్చని పేర్కొన్నారు.
1950ల కాలంలో యూఎస్ అణ్వాయుధాల తయారీకి అవసరమైన ట్రిటియం, ప్లుటోనియం ఉత్పత్తి కోసం ఈ సవన్నా రివర్ సైట్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ పరిశోధనలతో పాటు ట్రిటియం ఉత్పత్తి, ఉపయోగించిన అణు ఇంధన నిర్వహణ, యురేనియం, ప్లుటోనియం నిల్వలు జరుగుతున్నాయి. ప్రమాదం చోటుచేసుకున్న ల్యాబ్ ప్రాంతం ప్రధానంగా పరిశోధనలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ప్రస్తుతం సుమారు 13,000 మందికి పైగా కాంట్రాక్ట్, ఫెడరల్ ఉద్యోగులు ఈ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్నారు.
అమెరికా తిరిగి భారీ స్థాయిలో అణ్వాయుధాల ఆధునికీకరణ, ఉత్పత్తిని వేగవంతం చేసే ప్రాజెక్టులో ఈ స్థావరం అత్యంత కీలకంగా మారింది. ఆధునిక అణ్వాయుధాల ప్రధాన పేలుడు భాగాలుగా భావించే ‘ప్లుటోనియం పిట్స్’ను భారీగా ఉత్పత్తి చేసేందుకు సుమారు $23.5 బిలియన్ల (రూ.లక్షల కోట్లు) అంచనా వ్యయంతో ఇక్కడ కొత్త కేంద్రాన్ని నిర్మించేందుకు నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (NNSA) ఇటీవల అనుమతులు జారీ చేసింది. ఇంతటి సున్నితమైన ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడం తీవ్ర చర్చనీయాంశమైనప్పటికీ, ఎటువంటి హాని కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

