Last Updated:
దుబాయ్-టెల్ అవీవ్ విమానం హైజాక్ యత్నాన్ని ప్రాణాలకు తెగించి అడ్డుకున్న భారత పైలట్ స్మిత్ మచ్చార్ తలకు పడిన కుట్ల ఫొటోలు బయటకు వచ్చాయి. యూఏఈ ప్రభుత్వం ఆయనను అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన హైజాక్ యత్నాన్ని వీరోచితంగా అడ్డుకుని 170 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ తలకు పడిన కుట్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యూఏఈ ప్రభుత్వం విమాన సిబ్బందిని ఘనంగా సత్కరించిన వేదికపై ఈ గాయాల దృశ్యాలు బయటకు రావడంతో నెటిజన్లు ఆయన ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్ 1073 ప్రయాణిస్తుండగా సహ పైలట్ ఉన్నట్టుండి కాక్‌పిట్ క్రాష్ గొడ్డలితో స్మిత్ తలపై తీవ్రంగా దాడి చేశాడు. పుర్రె ఎముక విరిగి తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా, స్మిత్ ప్రాణాలకు తెగించి కాక్‌పిట్ డోర్ తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ పెనుగులాట సమయంలో విమానం కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14 వేల అడుగులు కిందికి పడిపోయింది. ఆ సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్లు సమయస్ఫూర్తితో కాక్‌పిట్ బాధ్యతలు చేపట్టి సౌదీ అరేబియాలోని తబుక్ నగరంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. స్మిత్‌కు తబుక్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అబుదాబికి తరలించారు.
ఈ అసాధారణ సాహసానికి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్మిత్‌కు తొలి శ్రేణి ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ 2’ పురస్కారాన్ని ప్రకటించగా, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ చేతుల మీదుగా దానిని అందజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్మిత్‌ను నిజమైన హీరోగా కొనియాడారు.
స్మిత్ స్వరాష్ట్రమైన గుజరాత్ ప్రభుత్వం విశిష్ట గుజరాత్ గరిమ అవార్డును ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ఆయన్ను గౌరవించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కోలుకుంటున్న కెప్టెన్ స్మిత్ ఫొటోలు చూసిన యావత్ భారతావని ఆయన సాహసానికి సెల్యూట్ చేస్తోంది.

