వర్షాకాలం కొనసాగుతున్నా దేశవ్యాప్తంగా ఎండలు, వేడి తీవ్రత తగ్గడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు చాలా ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఉక్కపోత పెరుగుతోంది. దీంతో ఇళ్లలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వంటి విద్యుత్ పరికరాల వినియోగం పెరిగి, కరెంట్ బిల్లులు కూడా భారీగా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటి కరెంట్ బిల్లును తగ్గించుకునేందుకు చాలామంది రూఫ్‌టాప్ సోలార్ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PM సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన కూడా ఇళ్లపై సోలార్ ఏర్పాటు చేసుకునే ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇంట్లో రెండు ఇన్వర్టర్ ఏసీలు, మూడు ఫ్యాన్లు ఉంటే ఎంత సామర్థ్యం ఉన్న సోలార్ సిస్టమ్ అవసరం? ఎన్ని ప్యానెల్స్ అమర్చాలి? దీనికి ఒకే సమాధానం ఉండదు. ఏసీ సామర్థ్యం, రోజులో ఎన్ని గంటలు వాడుతున్నారు, ఫ్యాన్ల వాటేజ్, ఫ్రిజ్, టీవీ, లైట్లు, వాటర్ పంప్ వంటి ఇతర పరికరాల వినియోగం ఆధారంగా అవసరం మారుతుంది.

