దీంతో జూన్లో భారతదేశ వెండి దిగుమతులు కేవలం 37 టన్నులకు పడిపోయాయి. ఇది మూడేళ్లలో అత్యల్ప నెలవారీ స్థాయి. అనంతరం పరిమిత సంఖ్యలో అనుమతులు లభించడంతో సెప్టెంబర్లో దిగుమతులు 328 టన్నులకు పెరిగినట్లు మెటల్స్ ఫోకస్ అంచనా వేసింది. గత ఏడాది భారత్ 7,000 టన్నులకు పైగా వెండిని దిగుమతి చేసుకుంది. ఈ భారీ కొనుగోళ్లు అంతర్జాతీయ మార్కెట్లో సరఫరాపై ఒత్తిడిని పెంచి, ధరల పెరుగుదలకు కొంతవరకు దోహదపడ్డాయి. జనవరిలో వెండి ధర ఔన్సుకు 121 డాలర్లకు పైగా చేరగా, గురువారం స్పాట్ ధర సుమారు 56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, ఈ ఏడాది పండుగ సీజన్లో వెండి వినియోగం గత ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిటైలర్లు, టోకు వ్యాపారుల వద్ద నిల్వలు తక్కువగా ఉండటంతో పాటు, గత ఏడాది అధిక ధరలకు వెండి కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు ఇంకా నష్టాల్లో ఉండటం కొత్త కొనుగోళ్లను పరిమితం చేస్తోందని హర్షల్ బరోట్ తెలిపారు.

