సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్, మేధో సంపత్తి (ఐపీ), వాణిజ్య అవసరాలు, వ్యూహాత్మక చిప్ డిజైన్లు, కీలక భాగాల తయారీ సామర్థ్యాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద సెమీకండక్టర్ యంత్రాలు, ముడి పదార్థాలు, రసాయనాలు, గ్యాస్‌ల తయారీ చేసే కంపెనీలకు ప్రోత్సాహం అందించనున్నారు. అలాగే మరిన్ని చిప్ తయారీ యూనిట్లను భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు.
1. చిప్ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు: దేశీయ చిప్ డిజైన్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం ఈ లక్ష్యంలో భాగం. స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు స్వదేశీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ), సిస్టమ్ డిజైన్లు, సిస్టమ్స్-ఆన్-చిప్ (ఎస్‌ఓసీ)లను అభివృద్ధి చేసేందుకు సహాయం అందిస్తారు. ఇవి వాణిజ్య అవసరాలతో పాటు వ్యూహాత్మక రంగాల్లో కూడా ఉపయోగపడేలా ప్రోత్సహిస్తారు.
2. యంత్రాలు, ముడి పదార్థాల సరఫరా వ్యవస్థ: సెమీకండక్టర్ తయారీకి అవసరమైన పరికరాలు, కీలక ముడి పదార్థాలు, గ్యాస్‌లు, ప్రత్యేక రసాయనాల తయారీని ప్రోత్సహిస్తారు. దీంతో భారత్‌లోనే బలమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసి, విదేశాలపై ఆధారపడటం తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
3. మరిన్ని ఫ్యాబ్ యూనిట్ల ఏర్పాటు: తదుపరి తరం సెమీకండక్టర్ తయారీని వేగవంతం చేసేందుకు కొత్త సిలికాన్, కాంపౌండ్ ఫ్యాబ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం ఇవ్వనున్నారు.
4. ఏటీఎంపీ/ఓశాట్ పరిశ్రమ బలోపేతం: అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ), ఔట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓశాట్) సదుపాయాలను విస్తరించనున్నారు. ముఖ్యంగా అధునాతన ప్యాకేజింగ్ టెక్నాలజీలపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారు.
5. అధునాతన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ): కొత్త టెక్నాలజీ నోడ్స్, అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఆధునిక పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారు.
6. నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి: చిప్ డిజైన్, క్లీన్ రూమ్ ఫ్యాబ్ కార్యకలాపాల్లో నిపుణులైన సిబ్బందిని తయారు చేయడానికి శిక్షణ కార్యక్రమాలను విస్తరించనున్నారు. 315 యూనివర్సిటీలతో పరిశ్రమ-విద్యా సంస్థల భాగస్వామ్యాన్ని పెంచి, 68,000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పథకం వల్ల ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది?
సెమికాన్ 2.0 కోసం కేటాయించిన రూ.1.27 లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా మొత్తం రూ.4 లక్షల కోట్ల వరకు ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించవచ్చని అంచనా. దీంతో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి పెరగవచ్చు. అలాగే భారత టెక్నాలజీ ఎగుమతులు దాదాపు రూ.1 లక్ష కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తంగా, సెమికాన్ 2.0 ద్వారా భారత్‌ను ప్రపంచ స్థాయి చిప్ తయారీ కేంద్రంగా మార్చడం, దేశీయ తయారీని పెంచడం, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
