Last Updated:
జొన్న రొట్టె, చపాతీ లేదా వేడి వేడి అన్నంతో ఈ కూర తింటే రుచి మరింత బాగుంటుంది. అయితే నాటుకోడి మాంసం కొంచెం గట్టిగా ఉండే అవకాశం ఉంది. అందుకే సరైన మసాలాలు ఉపయోగించడంతో పాటు, మాంసం మెత్తగా ఉడికే వరకు తగినంత సమయం కేటాయించాలి. మరి తెలంగాణ స్టైల్లో నాటుకోడి కూరను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంతో ఇష్టం. అయితే, సాధారణ ఫామ్ చికెన్‌తో పోలిస్తే నాటుకోడి కూరకు ప్రత్యేకమైన రుచి ఉంటుందని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నాటుకోడి కూరకు మంచి ఆదరణ ఉంది. మసాలాలు, కారం, ఉల్లిపాయలు కలిపి నెమ్మదిగా ఉడికిస్తే కూర మంచి రుచిని సంతరించుకుంటుంది. జొన్న రొట్టె, చపాతీ లేదా వేడి వేడి అన్నంతో ఈ కూర తింటే రుచి మరింత బాగుంటుంది. అయితే నాటుకోడి మాంసం కొంచెం గట్టిగా ఉండే అవకాశం ఉంది. అందుకే సరైన మసాలాలు ఉపయోగించడంతో పాటు, మాంసం మెత్తగా ఉడికే వరకు తగినంత సమయం కేటాయించాలి. మరి తెలంగాణ స్టైల్లో నాటుకోడి కూరను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఈ కూర తయారు చేయడానికి సుమారు కేజీన్నర నాటుకోడి మాంసం, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఐదు స్పూన్ల కారం, నాలుగు స్పూన్ల ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర పొడి, రెండు స్పూన్ల ధనియాల పొడి, ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం. అలాగే అర స్పూన్ షాజీరా, పావు స్పూన్ మిరియాల పొడి, ఎండిన కొబ్బరి ముక్క, రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు, దాల్చిన చెక్క ముక్కలు, ఐదు యాలకులు, ఏడు నుంచి ఎనిమిది లవంగాలు, సరిపడా నూనె, కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. మీకు కారం ఎక్కువగా ఇష్టం లేకపోతే దాని పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు.
తయారీ విధానం
ముందుగా నాటుకోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కూరకు కావాల్సిన మసాలాను సిద్ధం చేసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి తురిమిన ఎండిన కొబ్బరిని, గసగసాలను వేసి తక్కువ మంటపై వేయించాలి. అవి మంచి వాసన వచ్చే వరకు వేయించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా, మిరియాలు కలిపి మెత్తగా పొడి లేదా పేస్ట్‌లా చేసుకోవాలి.
ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి. అందులో నాటుకోడి మాంసం వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. మూత పెట్టి మాంసం నుంచి వచ్చే తేమతో కొద్దిసేపు ఉడికించాలి. అనంతరం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. తర్వాత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మసాలా మాంసానికి పట్టేలా కలపాలి.
ఇప్పుడు కూరకు కావాల్సినంత వేడి నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ లేదా మధ్యస్థ మంటపై ఉడికించాలి. నాటుకోడి మాంసం మెత్తగా ఉడకడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అవసరమైతే మరికొంత నీరు కలుపుతూ ఉడికించాలి. మాంసం పూర్తిగా ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి. అంతే.. ఘాటైన మసాలా రుచితో తెలంగాణ స్టైల్ నాటుకోడి కూర సిద్ధం.
ఈ కూరను వేడి వేడి అన్నం, జొన్న రొట్టె లేదా చపాతీతో వడ్డించవచ్చు. మసాలాల రుచి బాగా కలిసిన ఈ కూర నాన్‌వెజ్ ప్రియులకు మంచి విందుగా ఉంటుంది.

