Last Updated:
పునరుత్పాదక ఇంధన రంగంలో దశాబ్ద కాలంగా చేపట్టిన సంస్కరణలే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల నుంచి దేశాన్ని కాపాడాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రైతులు విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారాలనేది తన లక్ష్యమని ఢిల్లీ సదస్సులో పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గడిచిన పదేళ్ల కాలంలో దేశం స్వచ్ఛ ఇంధన రంగంలో సరైన మౌలిక వసతులు, వ్యవస్థలను అభివృద్ధి చేసుకోకపోయి ఉంటే పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ‘భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో’లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచమంతా ఎనర్జీ షాక్ గురించి చర్చిస్తున్న వేళ, మన అభివృద్ధి ప్రయాణంలో గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యత మరింత పెరిగిందన్నారు. ప్రస్తుతం సౌర, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి మూడు దేశాల్లో ఒకటిగా నిలిచిందని మోదీ గర్వంగా ప్రకటించారు. ఈ స్వచ్ఛ ఇంధన విజయాల అనుభవాన్ని ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని వివరించారు.
గృహ వినియోగదారులకు సౌరశక్తిని చేరువ చేయడంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని ప్రధాని తెలిపారు. ప్రతి నెలా దాదాపు లక్ష గృహాలు ఈ సోలార్ మిషన్‌లో భాగస్వామ్యమవుతున్నాయని చెప్పారు. దీనివల్ల వేలాది కుటుంబాలు జీరో కరెంట్ బిల్లులను అందుకుంటూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాయని గుర్తుచేశారు.
వ్యవసాయ రంగంలోనూ సౌరశక్తి వినియోగాన్ని పెద్ద ఎత్తున విస్తరిస్తున్నామని ప్రధాని తెలిపారు. పొలాలను సోలార్ పవర్‌తో అనుసంధానించడమే కాకుండా, రైతులకు అదనపు ఆదాయ వనరులను సృష్టించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ‘అన్నదాతలు ఇకపై ఇంధనదాతలుగా మారాలి’ అనేదే తన ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు.
స్వచ్ఛమైన వంట ఇంధన కార్యక్రమాల అమలులో భారత్ చూపిన వేగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఉన్న బలమైన రాజకీయ, విధానపరమైన స్థిరత్వం కారణంగానే ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు భారత్ ప్రధాన ఆకర్షణగా మారిందని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్లకు మన దేశం అపరిమిత అవకాశాల గని అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

