Last Updated:
Sting Operation: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న వివాదాస్పద ‘స్టింగ్ ఆపరేషన్’ కేసు విచారణలో అత్యంత కీలకమైన, అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోల వ్యవహారం ఇప్పుడు నేరుగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి అధికారిక నివాసానికి లింక్ అయినట్లు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. ఈ మొత్తం కుట్ర, వీడియోల అప్‌లోడ్ వ్యవహారాలన్నీ దేశ రాజధాని న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి కుమారస్వామి అధికారిక బంగళాలోనే జరిగినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ సంచలన విషయాలు వెల్లడించారు.
సెప్టెంబరు నెలలో సిద్ధరామయ్యకు సంబంధించిన కొన్ని వివాదాస్పద వీడియో క్లిప్పింగులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసిన ఈ పరిణామంపై సిద్ధరామయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన అధికారులు, స్టింగ్ ఆపరేషన్ వెనుక ఉన్న కీలక నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ కేసుకు సంబంధించి ఆదివారం మీడియాతో మాట్లాడిన పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ కీలక వివరాలు పంచుకున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఢిల్లీ నివాసి అయిన రితేష్ పాండే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వాంగ్మూలం సేకరించినట్లు ఆయన తెలిపారు. ఆ వాంగ్మూలంలో నిందితుడు పేర్కొన్న అంశాలు రాజకీయ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నాయి.
జేడీఎస్ పార్టీ మీడియా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ప్రజ్వల్‌ప్రసాద్ ఇచ్చిన ఆదేశాల మేరకు వినోద్‌శర్మతో కలిసి తాను ఢిల్లీలోని కరోల్‌బాగ్ మార్కెట్‌కు వెళ్లి ప్రత్యేకంగా ఒక మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసినట్లు రితేష్ పాండే విచారణలో ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ కొత్త మొబైల్‌లోనే వివాదాస్పద ‘స్టింగ్ ఆపరేషన్’ వీడియోను అప్‌లోడ్ చేశామని వివరించాడు. అనంతరం ఆ మొబైల్‌ను తీసుకువెళ్లి ఢిల్లీలోని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అధికారిక నివాసంలో స్వయంగా అందజేసినట్లు రితేష్ పాండే అంగీకరించాడని కమిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన పాత్రధారులుగా భావిస్తున్న ప్రజ్వల్‌ప్రసాద్, వినోద్‌శర్మ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని సీపీ వివరించారు.
పోలీస్ కమిషనర్ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. స్వయంగా సిద్ధరామయ్య సొంత కుమారుడే ఈ స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతల హస్తం ఉందని బహిరంగంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారని కుమారస్వామి గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, అధికార కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి తనపై బురదజల్లుతున్నారని, తప్పుడు కేసులతో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు.
ఈ పరిణామంతో కర్ణాటకలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష జేడీఎస్-బీజేపీ కూటమి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అధికారిక నివాసం వేదికగా సాగిన ఈ టెక్నికల్ వ్యవహారంపై న్యాయపరంగా, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

