Last Updated:
పేదలు, గ్రామీణులు, మహిళలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 59 కోట్ల ఖాతాలు ఉండగా, వీటిలో 33 కోట్లకు పైగా మహిళల పేరిటే ఉన్నాయి. జీరో బ్యాలెన్స్ ఖాతా, ఉచిత డెబిట్ కార్డు, ప్రమాద బీమా వంటి ప్రయోజనాలతో జన్ ధన్ యోజన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పుకు దోహదపడింది.
భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసిన ప్రతిష్టాత్మక ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ (PMJDY) పథకం శుక్రవారం నాటికి విజయవంతంగా 12 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ పథకం దేశంలో అసమానమైన ప్రభావాన్ని చూపడంతో పాటు సామాన్యుల జీవితాల్లో గొప్ప పరివర్తనను తీసుకువచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పేదలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది.

