మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ, వాయిస్ కాల్స్ ఇప్పటికీ ఎక్కువగా ఉపయోగించే టెలికాం సేవగా ఉన్నాయని అనిల్ కుమార్ లహోటి చెప్పారు. వినియోగదారులు నమ్మకమైన కనెక్టివిటీ, స్పష్టమైన సంభాషణలను కోరుకుంటున్నారని తెలిపారు. ట్రాయ్ రూపొందించిన క్వాలిటీ ఆఫ్ సర్వీస్ విధానంలో నియంత్రణ ప్రమాణాలు, క్రమం తప్పని రిపోర్టింగ్, స్వతంత్ర డ్రైవ్ టెస్టులు, పర్యవేక్షణ వంటి చర్యల వల్ల పారదర్శకత, బాధ్యత పెరిగాయని లహోటి చెప్పారు. అయితే నిజమైన కాలింగ్ అనుభవంపై వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ కూడా చాలా కీలకమని, ఇది టెక్నికల్ కొలతలకు తోడై టెలికాం సేవల నాణ్యతపై మరింత స్పష్టమైన అంచనాకు సహాయపడుతుందని తెలిపారు. “వినియోగదారులు తమ వాయిస్ కాలింగ్ అనుభవాన్ని స్వచ్ఛందంగా రేట్ చేయడానికి, కాల్ తర్వాత వెంటనే లేదా యాప్ ద్వారా సమస్యలను తెలియజేయడానికి సులభమైన మార్గం అందించాలనే ఉద్దేశంతోనే ట్రాయ్ మైకాల్ మొబైల్ యాప్‌ను కొత్తగా రూపొందించింది. కాల్ డ్రాప్స్, ఎకో, ఆడియో ఆలస్యం, క్రాస్ కనెక్షన్ వంటి సమస్యలను ఇందులో నమోదు చేయవచ్చు” అని లహోటి చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

