Last Updated:
News18 Rising Bharat Summit: సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎస్పీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ పదవి పోతుందన్న మూఢనమ్మకంతో నోయిడాలో అడుగుపెట్టడానికి కూడా భయపడ్డారని, అంతేకాకుండా 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల నిందితుడిని విమానంలో పిలిపించుకుని పూలమాలలతో సత్కరించారని ఆరోపించారు. బుధవారం జరిగిన ‘న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్’ (Rising Bharat Summit) కార్యక్రమంలో నెట్‌వర్క్18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషితో నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.
గత సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటం వల్లే ఉత్తరప్రదేశ్ పతనం దిశగా సాగిందని యోగి విమర్శించారు. “తన ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోతుందోనన్న భయంతో ఒక ముఖ్యమంత్రి నోయిడాకు వెళ్లడానికే భయపడి.. మరోవైపు ఒక అల్లరిమూక నాయకుడిని విమానంలో పిలిపించుకుని పూలమాలలతో స్వాగతం పలికితే ఆ రాష్ట్రం పతనం కాకుండా ఎలా ఉంటుంది?” అని యోగి ప్రశ్నించారు. 2012 నుంచి 2017 వరకు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్ యాదవ్, తన పదవీకాలంలో ఒక్కసారి కూడా నోయిడాలో పర్యటించలేదు. ఆ నగరంలో చేపట్టిన పలు ప్రాజెక్టులను ఆయన లక్నో నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు.
2013 సెప్టెంబర్‌లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మౌలానా నజీర్ అనే వ్యక్తిని అప్పటి సీఎం అఖిలేష్ ప్రభుత్వ విమానంలో లక్నోకు రప్పించుకుని, స్వాగతం పలికి, వై-కేటగిరీ (Y-category) భద్రత కల్పించారని నాడు బీజేపీ నేతలు ఆరోపించిన వివాదాన్ని యోగి ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు. “నేడు అల్లర్లకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడం లేదు. కఠిన చర్యలు తీసుకుంటున్నాం. దీనివల్ల నేడు ఉత్తరప్రదేశ్‌పై దేశవ్యాప్తంగా ఒక కొత్త సానుకూల అభిప్రాయం ఏర్పడింది” అని యోగి స్పష్టం చేశారు.
గత ఎస్పీ ప్రభుత్వ పాలనా రికార్డును ప్రశ్నిస్తూ, ఆ సమయంలో రాష్ట్రంలో సురక్షితమైన వాతావరణం కల్పించడంలో విఫలమయ్యారని యోగి మండిపడ్డారు. “సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆడబిడ్డలు, మహిళల గౌరవానికి, భద్రతకు ఎప్పుడైనా రక్షణ లభించిందా? ఎన్నడూ లేదు!” అని ఆయన అన్నారు. అలాగే పెట్టుబడులను ఆకర్షించడంలోనూ నాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. “2017కు ముందు సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించినప్పటికీ, ఒక్క ఇన్వెస్టర్ కూడా ఉత్తరప్రదేశ్‌కు రావడానికి ముందుకు రాలేదు” అని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

