Last Updated:
26/11 ఉగ్రదాడి 18వ వర్ధంతి సందర్భంగా ముంబైలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం, ముంబై మేయర్ కార్యాలయం, దిల్జిత్ దోసాంజ్ కాన్సర్ట్‌కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
ముంబై 26/11 ఉగ్రదాడికి 18 ఏళ్లు నిండిన సందర్భంగా గురువారం ఆర్థిక రాజధానిలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ నివాసంతో పాటు ముంబై మేయర్ రితూ తావ్డే కార్యాలయం, బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని భిడేకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అలాగే నగరంలో జరగనున్న ప్రముఖ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ కాన్సర్ట్ వేదికకు, ఆచార్య మెట్రో స్టేషన్‌కు కూడా ఇదే తరహా హెచ్చరికలు అందాయి.
వేర్పాటువాద నినాదాలతో కూడిన ఈ మెయిల్స్ అందిన వెంటనే ముంబై పోలీసులు అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది మేయర్ కార్యాలయానికి ఇలాంటి బెదిరింపు రావడం ఇది ఐదోసారి కాగా, నిందితులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరోవైపు 26/11 ఉగ్రదాడి 18వ వర్ధంతిని పురస్కరించుకుని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అమరవీరులకు నివాళులర్పించారు. 2008 నాటి ఈ దాడి కేవలం ముంబై నగరంపై జరిగినది కాదని, భారత రాజ్యాంగంపై జరిగిన దాడి అని ఆయన పేర్కొన్నారు. విదేశీయులు, దౌత్యవేత్తలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఉగ్రవాదులు కావాలనే ఎంచుకుని దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారని తెలిపారు. భారత సైనికులు, పౌరులపై దాడులను దేశం ఎన్నటికీ సహించదని, బాధ్యులపై గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన పోలీసు అధికారుల త్యాగాలను ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గుర్తుచేసుకున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ చేతిలో తుపాకీ ఉన్నప్పటికీ, కేవలం లాఠీతోనే ఎదురెళ్లి పలు బుల్లెట్లు తగిలినా కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తుకారాం ఓంబ్లే సాహసం మరువలేనిదని కొనియాడారు. అలాగే విధి నిర్వహణలో అమరులైన సీనియర్ పోలీసు అధికారులు హేమంత్ కర్కరే, అశోక్ కామ్టే, విజయ్ సలాస్కర్, ఎన్ఎస్‌జీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌లకు సీఎం ఘన నివాళులర్పించారు. కాగా, 2008 నవంబర్ 26న పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

