కావలసిన పదార్థాలు
ఈ పొంగలి తయారు చేయడానికి ఒక కప్పు కొర్రలు, అర కప్పు పెసరపప్పు, నాలుగు కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు తీసుకోవాలి. తాలింపు కోసం మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ మిరియాలు, ఒక పిడికెడు జీడిపప్పు, మూడు పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం అల్లం ముక్క, రెండు రెమ్మల కరివేపాకు, రెండు చిటికెల ఇంగువ సిద్ధంగా ఉంచుకోవాలి.
కొర్రలు, పెసరపప్పును ఎలా ఉడికించాలి?
ముందుగా కొర్రలను శుభ్రంగా కడిగి రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా ఉడకడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఒక బాండీని పొయ్యిపై పెట్టి అందులో అర కప్పు పెసరపప్పు వేసి నూనె లేకుండా తక్కువ మంటపై వేయించాలి. పప్పు నుంచి మంచి వాసన వచ్చి కొద్దిగా రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాన్ని నీటితో శుభ్రంగా కడగాలి.
ఇప్పుడు కుక్కర్లో నానబెట్టిన కొర్రలు, వేయించిన పెసరపప్పు వేయాలి. అందులో తగినంత ఉప్పు, నాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాతే మూత తీయాలి. మిశ్రమం కొద్దిగా పలుచగా కనిపించినా గరిటెతో బాగా కలిపితే మెత్తని పొంగలి రూపంలోకి వస్తుంది.
కమ్మని తాలింపు ఎలా వేయాలి?
తాలింపు గరిటెలో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. తర్వాత నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించాలి. ఈ తాలింపు నుంచి మంచి సువాసన వచ్చిన తర్వాత ఉడికించిన కొర్రలు, పెసరపప్పు మిశ్రమంలో వేయాలి. అన్నీ కలిసేలా బాగా కలిపితే కమ్మని కొర్రల కట్టె పొంగలి సిద్ధమవుతుంది.
ఏ సమయంలో తింటే బాగుంటుంది?
ఈ పొంగలిని ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి భోజనంగా తీసుకోవచ్చు. కొబ్బరి చట్నీ, సాంబార్‌తో కలిపి తింటే రుచి మరింత పెరుగుతుంది. కొర్రల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అయితే నెయ్యి, ఉప్పు పరిమాణాన్ని మీ అవసరాలకు అనుగుణంగా తగ్గించుకోవచ్చు. ఇలా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకున్న కొర్రల పొంగలితో రుచికరమైన, వైవిధ్యమైన అల్పాహారాన్ని ఆస్వాదించండి.
