Last Updated:
France Riots: ఫ్రాన్స్‌లో చెలరేగిన హింసాత్మక ఆందోళనలు, అల్లర్లు అదుపు తప్పుతున్నాయి. నిరసనల ముసుగులో అల్లరి మూకలు వందలాది వ్యాపార దుకాణాలు, అంతర్జాతీయ లగ్జరీ షోరూమ్‌లను లక్ష్యంగా చేసుకుని విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతున్నాయి.
మరింత విస్మయకరమైన విషయమేమిటంటే, ఆ విధంగా లూటీ చేసిన ఖరీదైన వస్తువులను ఏమాత్రం భయం లేకుండా ప్రముఖ ఆన్‌లైన్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో బహిరంగంగా అమ్మకానికి పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఫ్రెంచ్ రీటైల్ అండ్ ట్రేడ్ ఫెడరేషన్ వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనల్లో సుమారు 1500 దుకాణాలు, వ్యాపార సంస్థలు తీవ్ర లూటీకి గురయ్యాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అత్యంత ఖరీదైన లూయిస్ విటాన్, ఎర్మెస్, రోలెక్స్, యాపిల్, సెలిన్ సెఫోరా, బర్బెర్రీ వంటి బ్రాండెడ్ షోరూమ్‌ల అద్దాలు పగులగొట్టి దుండగులు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. లూటీ చేసిన లగ్జరీ డిజైనర్ బ్యాగులు, చేతి గడియారాలు, స్మార్ట్‌ఫోన్లను ప్రముఖ ఆన్‌లైన్ సెకండ్‌హ్యాండ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘వింటెడ్’ (Vinted)లో అమ్మకానికి ఉంచినట్లు గుర్తించారు. సాధారణంగా ‘రియల్ రియల్’ వంటి వేదికల్లో అమ్మకానికి పెట్టే వస్తువుల ప్రామాణికతను నిపుణులు ధ్రువీకరిస్తారు. కానీ, వింటెడ్‌లో విక్రేత నేరుగా కొనుగోలుదారుడికి (పీర్-టు-పీర్) విక్రయించే వెసులుబాటు ఉండటం, దానికి ఫ్రాన్స్‌లో భారీ కస్టమర్ బేస్ ఉండటంతో అల్లరి మూకలు ఈ ప్లాట్‌ఫామ్‌ను తమ దోపిడీ సొత్తును విక్రయించేందుకు అనువుగా వాడుకుంటున్నాయి.
ఈ అక్రమ ఆన్‌లైన్ అమ్మకాల వ్యవహారంపై ఫ్రాన్స్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ డిజిటల్ వ్యవహారాల మంత్రి అన్నె లెహానోఫ్ స్పందిస్తూ.. దోచుకున్న లగ్జరీ వస్తువులను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించడాన్ని ఎంతమాత్రం చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను ఆయా సంస్థలే స్వచ్ఛందంగా తమ వేదికల నుంచి తొలగించాలని, ఈ చర్యలకు పాల్పడుతున్న నేరగాళ్లను గుర్తించి చట్టపరంగా శిక్షించేందుకు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ హెచ్చరికలతో మేల్కొన్న వింటెడ్ సంస్థ అనుమానాస్పద వస్తువులను వేదిక నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు అల్లరి మూకల దాడి నుంచి తమ స్టోర్లను కాపాడుకోవడానికి ప్రఖ్యాత డియోర్ (Dior) సంస్థ ఏకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను రంగంలోకి దించింది.
Another day, another luxury boutique cleaned out in Paris.
Paris tonight.Groups of youths smashing up the Celine store in broad daylight and looting bags like it’s completely normal.
“Cost of living protests” have totally devolved into pure lawlessness. Unreal scenes.
While the media calls them “protesters,” groups of youths are running through the streets looting designer stores unchecked.
— Leo (@Leonajardinho) October 18, 2026
ఫ్రాన్స్‌లో అల్లర్ల తీవ్రతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ఈ హింసాత్మక పరిణామాలకు ఆ దేశం అవలంబించిన మితిమీరిన వలస విధానాలే ప్రధాన కారణమని ఆయన విమర్శించారు. ప్రపంచం నలుమూలల నుంచి విచ్చలవిడిగా జనాభాను ఫ్రాన్స్‌కు తీసుకురావడం తీవ్ర తప్పిదమని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ను తాను ఎప్పుడో హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అతి త్వరలోనే పారిస్ నగరం ఒక ముస్లిం నగరంగా మారిపోయే ప్రమాదం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించడం అంతర్జాతీయ స్థాయిలో పెను దుమారం రేపింది.

