Last Updated:
అమెరికాలో వలసదారుల వర్క్ పర్మిట్ల 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపును యూఎస్సీఐఎస్ రద్దు చేసింది. రెన్యువల్ ఆలస్యమైతే వేలాది మంది హెచ్-1బీ జీవిత భాగస్వాములు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
అమెరికాలో స్థిరపడిన విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయులకు యూఎస్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వివిధ కేటగిరీల వలసదారులకు ఇప్పటివరకు వర్తించిన వర్క్ పర్మిట్ల 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు నిబంధనను అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) రద్దు చేసింది. జో బైడెన్ హయాంలో బ్యాక్‌లాగ్‌ల దృష్ట్యా ప్రవేశపెట్టిన ఈ సదుపాయాన్ని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం సరికొత్త తుది నిబంధన ద్వారా అధికారికంగా తొలగించింది. తాజా నిర్ణయంతో రెన్యువల్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న సమయంలో ఉద్యోగం చేసే వెసులుబాటు ఇకపై ఉండదు. ప్రస్తుత అనుమతి గడువు ముగిసి కొత్త కార్డు చేతికి రాకపోతే తప్పనిసరిగా ఉద్యోగం నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ మార్పు భారతీయులతో కూడిన హెచ్-1బీ ఉద్యోగుల కుటుంబాలపై పిడుగులా పడింది.
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) ఆధారంగా అమెరికాలో విధులు నిర్వహిస్తున్న వేలాది మంది హెచ్-4 జీవిత భాగస్వాములకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. స్టేటస్ మార్పు కోరేవారు, శరణార్థులు కూడా ఈ ప్రభావానికి గురికానున్నారు. అయితే స్టెమ్ కోర్సులు పూర్తి చేసిన ఎఫ్-1 విద్యార్థులకు సకాలంలో దరఖాస్తు చేసుకుంటే లభించే 180 రోజుల పొడిగింపు నిబంధన యథాతథంగా కొనసాగనుంది. ఎల్, ఈ వీసాదారుల భాగస్వాములు తమ ఇమిగ్రేషన్ హోదా ఆధారంగా పని చేసుకునే హక్కును నిలుపుకుంటారు.
మరోవైపు నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా పొడిగింపు ప్రక్రియను మరింత కఠినతరం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. గతంలో వచ్చిన అనుమతులను ప్రాతిపదికగా తీసుకోకుండా, ప్రతి దరఖాస్తును మొదటిసారి పరిశీలిస్తున్నట్లుగానే అధికారులు విచారించాలని నిబంధన విధించనుంది. దీనివల్ల డాక్యుమెంటేషన్ భారం పెరిగి, ప్రాసెసింగ్ విపరీతంగా ఆలస్యమై కంపెనీలకు చట్టపరమైన ఖర్చులు తడిసిమోపెడవుతాయి. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ ప్రతిపాదనపై నవంబర్ 13 వరకు ప్రజల నుంచి సలహాలు ఆహ్వానించింది.
ఈ తిరోగమన నిర్ణయంపై మాజీ వైట్ హౌస్ సలహాదారు, ప్రముఖ ఇమిగ్రేషన్ న్యాయవాది అజయ్ జైన్ భుటోరియా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ శ్రేయస్సుకు దోహదపడుతున్న చట్టబద్ధమైన వలసదారులు, హెచ్-4 భాగస్వాములు, ఆరోగ్య రంగ నిపుణుల జీవితాలపై ట్రంప్ సర్కార్ కోలుకోలేని దెబ్బ కొట్టిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ కఠిన విధానాలు వేలాది ప్రవాస కుటుంబాల జీవనాన్ని తీవ్ర అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయని విమర్శించారు.

