బంగారంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన అప్డేట్. పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఓఎఫ్) పథకాల్లో కొత్త పెట్టుబడులపై తాత్కాలికంగా ఆంక్షలు విధించాయి. అక్టోబర్ 16, 2026 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని మనీకంట్రోల్ కథనం వెల్లడించింది. అయితే ఇప్పటికే ఎస్ఐపీ ద్వారా పెట్టుబడులు పెడుతున్నవారి వాయిదాలు కొన్ని షరతులకు లోబడి కొనసాగుతాయి. అలాగే పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా డబ్బు పొందడం వంటి అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమకు చెందిన కొన్ని గోల్డ్ ఫండ్ పథకాల్లో కొత్త పెట్టుబడులను పరిమితం చేస్తున్నట్లు ప్రకటించాయి. క్రెసో అనే ఆన్లైన్ పెట్టుబడి పంపిణీ ప్లాట్‌ఫామ్ తెలిపిన వివరాల ప్రకారం, హెచ్డీఎఫ్సీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, డీఎస్పీ, ఇన్వెస్కో సంస్థలు కూడా ఈ ఆంక్షలకు సంబంధించి నోటీసులు జారీ చేశాయి. డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ మాత్రం సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుంచి వచ్చిన ఆదేశాలను ఈ నిర్ణయానికి కారణంగా పేర్కొంది. మిగతా సంస్థలు జారీ చేసిన నోటీసుల్లో మాత్రం కారణాన్ని స్పష్టంగా వెల్లడించలేదని క్రెసో తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

