Last Updated:
Gold Fraud: బంగారం ధరలు తగ్గుతున్నాయని నగలు కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ షాపులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు కొనే బంగారంలో కల్తీ జరిగే ప్రమాదం ఉందని తెలుసా?
గతకొన్ని రోజులుగా బంగారం భారీగా తగ్గడంతో ఇదే మంచి ఛాన్స్ అని గోల్డ్ షాపులకు పరుగులు తీస్తున్నారా? పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది కదా అని నగలు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి! మీరు కొనే బంగారం నిజంగానే స్వచ్ఛమైనదా? అందులో ఏదైనా కల్తీ ఉందా? ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న ఒక కొత్త తరహా మోసం గురించి తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. బంగారం బరువు పెంచడానికి కేటుగాళ్లు ఏకంగా ‘రేనియం’ అనే లోహపు పొడిని కలుపుతున్నారట! అసలు ఏంటీ రేనియం? హాల్ మార్కింగ్ టెస్టింగ్‌లో కూడా ఇది ఎందుకు దొరకడం లేదు? బంగారం కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయి నుంచి మెల్లగా కిందకు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులు, డాలర్ విలువ పెరగడం వంటి కారణాలతో పసిడి రేట్లు కాస్త కూల్ అవుతున్నాయి. ఆకాశాన్ని తాకిన గోల్డ్ రేట్లు ఇలా వరుసగా పడిపోతుండటంతో సామాన్యులకు పెద్ద ఊరట లభించింది. ఇదే అదనుగా భావించి చాలామంది బంగారు ఆభరణాలు, కాయిన్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, సరిగ్గా ఇదే సమయంలో నిపుణులు ఒక సంచలన హెచ్చరిక జారీ చేశారు. బంగారం బరువును అక్రమంగా పెంచేందుకు కొందరు అక్రమార్కులు ‘రేనియం’ (Rhenium) అనే లోహపు పొడిని కలుపుతున్నట్లు తాజాగా బయటపడింది. ఇది ఇప్పుడు గోల్డ్ మార్కెట్లో పెద్ద ఆందోళన కలిగిస్తోంది.
అసలు ఈ రేనియం ఎందుకు అంత డేంజర్ అంటే… దీని బరువు, సాంద్రత దాదాపు బంగారానికి దగ్గరగా ఉంటాయి. అందుకే దీనిని బంగారంలో కలిపినప్పుడు సాధారణ కంటితో చూసి గుర్తించడం అస్సలు సాధ్యం కాదు. అన్నింటికంటే భయపెట్టే విషయం ఏంటంటే… సాధారణ హాల్ మార్కింగ్ టెస్టింగ్‌లో కూడా ఈ రేనియం కల్తీని గుర్తించడం చాలా కష్టమట! అంటే, మనం ప్యూర్ గోల్డ్ అనుకుని లక్షలు పోసి కొన్న నగల లోపల, బరువు కోసం ఈ లోహపు పొడి ఉండే ప్రమాదం ఉందన్నమాట.
ఈ నేపథ్యంలో బంగారం కొనేటప్పుడు కస్టమర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ కల్తీని ఎలా గుర్తించాలి? దీనికోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరీక్షలు అవసరమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ‘ఎక్స్-రే ఫ్లోరోసెన్స్’ (XRF), ‘ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ’ పరీక్షల ద్వారా బంగారంలో రేనియం లాంటి లోహాలు కలిశాయా? లేదా? అనేది ఖచ్చితంగా కనిపెట్టవచ్చంటున్నారు.
ముందుగా మీరు కొనే ప్రతి నగపై BIS హాల్ మార్క్ ఉందో లేదో తప్పకుండా చెక్ చేయండి. దానితో పాటు 6 అంకెల HUID నంబర్ (Hallmark Unique Identification Number) ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఈ 6 అంకెల కోడ్ ప్రతి నగకు యూనిక్‌గా ఉంటుంది. మీ మొబైల్లో ‘BIS Care App’ డౌన్లోడ్ చేసుకుని, ఆ నంబర్‌ను అందులో ఎంటర్ చేస్తే చాలు… ఆ నగ ఎక్కడ తయారైంది? దాని ప్యూరిటీ ఎంత? అనే పూర్తి వివరాలు వెంటనే మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
రెండో ముఖ్యమైన విషయం… బంగారం రేట్లు తగ్గాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ, తెలియని షాపుల్లో అస్సలు కొనకండి. ఎప్పుడూ నమ్మకమైన, పేరున్న జ్యువెలరీ షోరూమ్స్‌లోనే గోల్డ్ తీసుకోండి. బంగారం కొన్న తర్వాత పక్కాగా జీఎస్టీ బిల్లు (GST Bill) తీసుకోవడం మర్చిపోవద్దు. బిల్లులో బంగారం క్యారెట్, బరువు, మేకింగ్ ఛార్జీలు, HUID నంబర్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే, పెద్ద షోరూమ్స్‌లో ఉండే క్యారెట్ మీటర్ (XRF మెషిన్) ద్వారా మీ కళ్ల ముందే గోల్డ్ ప్యూరిటీని టెస్ట్ చేయించుకోండి. మొత్తానికి బంగారం రేట్లు పడిపోతుండటం కొనుగోలుదారులకు నిజంగా గుడ్ న్యూసే! కానీ, ఆ ఆనందంలో నాణ్యత విషయంలో అజాగ్రత్తగా ఉంటే మాత్రం జేబుకు పెద్ద చిల్లు పడే ప్రమాదం ఉంది. కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే బంగారం విషయంలో ఒక్క నిమిషం ఆలోచించి, అన్నీ చెక్ చేసుకుని కొనడమే తెలివైన పని.
