Last Updated:
Suzuki Access 125: కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా? ముఖ్యంగా సుజుకి యాక్సెస్ 125 కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. తన పాపులర్ 125 సీసీ స్కూటర్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బోర్డో రెడ్ రంగులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. తన పాపులర్ స్కూటర్‌లో కొత్త రంగులను పరిచయం చేసింది. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (SMIPL) యాక్సెస్ 125 కోసం రెండు కొత్త కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటు కొన్ని వేరియంట్లలో ఇప్పటికే ఉన్న రంగుల ఎంపికల్లోనూ మార్పులు చేసింది. కొత్త రంగులతో స్కూటర్ మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది.
కంపెనీ పరిచయం చేసిన కొత్త రంగుల్లో మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బోర్డో రెడ్ ఉన్నాయి. అయితే ఈ రెండు రంగులూ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉండవు. మెటాలిక్ రాయల్ బ్రాంజ్ కలర్‌ను యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్, రైడ్ కనెక్ట్ ఏబీఎస్ ఎడిషన్లలో అందిస్తోంది. మెటాలిక్ మ్యాట్ బోర్డో రెడ్ రంగు మాత్రం టాప్ వేరియంట్ అయిన రైడ్ కనెక్ట్ టీఎఫ్‌టీ ఏబీఎస్ ఎడిషన్‌కు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది.
కొత్త రంగులతో పాటు మరికొన్ని వేరియంట్లలోనూ సుజుకి మార్పులు చేసింది. రైడ్ కనెక్ట్, రైడ్ కనెక్ట్ ఏబీఎస్ ఎడిషన్లకు పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ రంగును జోడించింది. స్టాండర్డ్ ఎడిషన్‌లో సాలిడ్ ఐస్ గ్రీన్ రంగును పరిచయం చేసింది. స్పెషల్ ఎడిషన్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న రంగుల ఎంపికలతోనే కొనసాగుతుంది. ఈ కొత్త రంగులతో కూడిన సుజుకి యాక్సెస్ 125 స్కూటర్లు నవంబర్ 23, 2026 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి వస్తాయి. కొత్త రంగుల్లో స్కూటర్ కొనాలనుకునే వారు దగ్గర్లోని సుజుకి షోరూమ్‌ను సంప్రదించవచ్చు.
ధరల విషయానికి వస్తే, యాక్సెస్ 125 స్టాండర్డ్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.83,086గా ఉంది. స్పెషల్ ఎడిషన్ ధర రూ.89,428. రైడ్ కనెక్ట్ ఎడిషన్ ధర రూ.91,627 కాగా, రైడ్ కనెక్ట్ ఏబీఎస్ ఎడిషన్ ధర రూ.98,432గా నిర్ణయించారు. ఇక అత్యాధునిక ఫీచర్లు ఉన్న రైడ్ కనెక్ట్ టీఎఫ్‌టీ ఏబీఎస్ ఎడిషన్ ధర రూ.1,03,780గా ఉంది. ఇవన్నీ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధరలు. రాష్ట్రాన్ని బట్టి ఆన్‌రోడ్ ధరలు మారుతాయి.
సుజుకి యాక్సెస్ 125లో 125 సీసీ, సింగిల్ సిలిండర్, ఫోర్ స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది OBD-2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఇంజిన్‌లో కంపెనీకి చెందిన సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ (SEP) టెక్నాలజీని అందించారు. ఇది మెరుగైన పనితీరు, ఇంధన సామర్థ్యానికి ఉపయోగపడుతుంది. రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడేలా ఈ స్కూటర్‌లో సీటు కింద 24.4 లీటర్ల స్టోరేజ్ స్థలం ఉంది. హెల్మెట్‌తో పాటు ఇతర చిన్న వస్తువులను ఇందులో పెట్టుకోవచ్చు. బయటివైపు ఫ్యూయల్ లిడ్ ఉండటంతో పెట్రోల్ పోయించుకోవడానికి ప్రతిసారీ సీటు తెరవాల్సిన అవసరం ఉండదు. విశాలమైన ఫ్లోర్‌బోర్డ్, పొడవైన సీటు కూడా ఇందులో ఉన్నాయి.
రైడ్ కనెక్ట్ వేరియంట్లలో బ్లూటూత్ సదుపాయంతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను స్కూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు కాల్స్, మెసేజ్‌లకు సంబంధించిన అలర్ట్‌లు పొందవచ్చు. టాప్ వేరియంట్‌లో 4.2 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భద్రత విషయంలోనూ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రైడ్ కనెక్ట్ ఏబీఎస్, రైడ్ కనెక్ట్ టీఎఫ్‌టీ ఏబీఎస్ వేరియంట్లలో సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉంటుంది. అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు చక్రాలు లాక్ కాకుండా నియంత్రించడంలో ఈ వ్యవస్థ సహాయపడుతుంది. మొత్తంగా కొత్త రంగులు, కనెక్టివిటీ ఫీచర్లు, భద్రతా సదుపాయాలతో యాక్సెస్ 125 కొనుగోలుదారులను ఆకట్టుకునేలా సుజుకి మార్పులు చేసింది.

