Last Updated:
Electric Two-Wheeler: ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లోకి మరో కొత్త వాహనం వచ్చేసింది. ఇప్పటివరకు కార్గో త్రీ-వీలర్ల తయారీలో ఉన్న ఆల్టిగ్రీన్.. ‘మిన్సారా’ పేరుతో తన తొలి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసింది. మూడు వేరియంట్లు, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయం, ఆకట్టుకునే రేంజ్‌తో దీన్ని తీసుకొచ్చింది. మరి దీని ధర ఎంత? ఫీచర్లు, బుకింగ్స్, డెలివరీ వివరాలేంటి?
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోకి మరో కొత్త కంపెనీ అడుగుపెట్టింది. ఇప్పటివరకు ప్రధానంగా ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ల తయారీపై దృష్టి పెట్టిన ఆల్టిగ్రీన్ (Altigreen), ఇప్పుడు ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించింది. జాక్సన్ గ్రూప్‌లో భాగంగా ఉన్న ఈ కంపెనీ ‘మిన్సారా’ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను విడుదల చేసింది. వ్యక్తిగత ప్రయాణాలతో పాటు వ్యాపార, వృత్తిపరమైన అవసరాలకు కూడా ఉపయోగపడేలా దీన్ని రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. రోజువారీ ప్రయాణాలకు, చిన్న వ్యాపారాల పనులకు, వస్తువుల డెలివరీకి చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకుంటున్నారు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిన్సారాను తీసుకొచ్చినట్లు ఆల్టిగ్రీన్ తెలిపింది. చిన్న వ్యాపారులు, డెలివరీ సిబ్బంది, సర్వీస్ టెక్నీషియన్లు, రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించే వారికి ఈ వాహనం ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది.
ఆల్టిగ్రీన్ మిన్సారాను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో మిన్సారా ఎస్ (S) మోడల్‌లో 2.78 kWh బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇక మిన్సారా ఎస్+ (S+) వేరియంట్‌లో 3.8 kWh బ్యాటరీ ఉంటుంది. ఈ మోడల్‌కు 165 కిలోమీటర్ల రేంజ్‌ను కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. మూడో వేరియంట్ మిన్సారా ఎస్ఈ (SE). ఇందులో బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాన్ని అందిస్తున్నారు. అంటే అవసరాన్ని బట్టి ఛార్జ్ అయిన బ్యాటరీని మార్చుకునే విధంగా ఈ మోడల్‌ను రూపొందించారు. అయితే బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
మిన్సారా ఎలక్ట్రిక్ టూ వీలర్‌లో 172 Nm గరిష్ఠ టార్క్, 33 శాతం గ్రేడబిలిటీ ఉన్నాయి. దీని గరిష్ఠ వేగం గంటకు 75 కిలోమీటర్లు. 264 కిలోల స్థూల వాహన బరువు సామర్థ్యం (GVWR) కలిగి ఉంది. ఈ వాహనంలో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, రిబ్-కేజ్డ్ ఛాసిస్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం క్రాష్ గార్డ్స్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన డ్యూయల్ డిస్క్ బ్రేకులను అందించారు.
మిన్సారా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.24 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం బెంగళూరు, విజయవాడ, నోయిడాలోని ఆల్టిగ్రీన్ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 2026 డిసెంబర్ 1 నుంచి కస్టమర్లకు డెలివరీలు చేయనున్నారు. ఈ వాహనంపై మూడేళ్లు లేదా 30,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ అందిస్తున్నారు. అదనంగా పొడిగించిన వారంటీ ఆప్షన్లను కూడా అందించే ప్రణాళికలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
జాక్సన్ గ్రీన్ వెహికల్స్ సీఈఓ దీపక్ ఠాకూర్ మాట్లాడుతూ.. రోజువారీ ప్రయాణాలతో పాటు జీవనోపాధి కోసం ద్విచక్ర వాహనాలపై ఆధారపడే వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిన్సారాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆల్టిగ్రీన్ సీటీఓ, వ్యవస్థాపకుడు అమితాబ్ శరణ్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తమకున్న ఇంజనీరింగ్ అనుభవాన్ని ఈ కొత్త ద్విచక్ర వాహనంలో ఉపయోగించినట్లు వివరించారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ టూ వీలర్లు, కార్గో త్రీ-వీలర్లతో పాటు ప్యాసింజర్ త్రీ-వీలర్ల విభాగంలోనూ తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆల్టిగ్రీన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మిన్సారా విడుదల కంపెనీకి కొత్త మార్కెట్‌లోకి విస్తరించే కీలక అడుగుగా చెప్పవచ్చు.

