Last Updated:
Egg Prices Soar in Hyderabad: ధరలు పెరగడమే కానీ.. తగ్గడం కనిపించట్లేదు. అన్ని వస్తువులకూ ఇదే జరుగుతోంది. ఇక కోడి గుడ్ల ధరలు వారం, వారం పెరిగిపోతున్నాయి. ఎందుకీ పరిస్థితి?
ఎండాకాలంలో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. అందువల్ల వాటి ధర పెరుగుతుంది. కానీ ఇది వానాకాలం. అయినప్పటికీ ఇప్పుడు కూడా కోడి గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో వ్యాపారులు ఒక్కో గుడ్డు ధరను రూ.10 చేసేశారు. రూ.100 ఇస్తే, 10 గుడ్లను మాత్రమే ఇస్తున్నారు. ఇదేంటని అడిగితే.. ధర పెరిగింది అంటున్నారు. హోల్ సేల్‌లో 30 గుడ్లు రూ.230 నుంచి రూ.240 మధ్య ఉంటున్నాయి. అంటే.. ఒక్కోటీ రూ.8 పలుకుతోంది. ఏపీ, తెలంగాణ అంతటా గుడ్ల ధరలు రూ.8 దాకా పలుకుతున్నాయి.
నిజానికి ఇప్పుడు బోనాల టైం. కాబట్టి.. చాలా మంది దీక్షలు, వ్రతాలు చేస్తూ.. నాన్ వెజ్ ముట్టరు. అందువల్ల చికెన్, కోడి గుడ్ల వంటి వాటి ధరలు తగ్గాయి. కానీ.. హైదరాబాద్‌లో చికెన్ ధరలు కాస్త తగ్గినా, గుడ్ల ధరలు మాత్రం తగ్గట్లేదు, పైగా పెరుగుతున్నాయి. స్కిన్ లెస్ చికెన్ గత వారం కేజీ రూ.350 ఉండగా.. ఇప్పుడు రూ.300కి లభిస్తోంది. కానీ కోడిగుడ్ల ధర పెరగడానికి ప్రత్యేక కారణం ఉంది.
గుడ్ల వాడకం బాగా పెరిగింది. స్కూళ్లు ఓపెన్ అవ్వడంతో.. మధ్యాహ్నం భోజనం కోసం గుడ్లను సప్లై చేస్తున్నారు. అలాగే.. ప్రజలు కూడా ఎక్కువ పోషకాలు ఉంటాయని ఎగ్స్ డైలీ వాడుతున్నారు. మరోవైపు విదేశాలకు కూడా ఎగుమతి పెరిగింది. మరోవైపు వానలు పడకపోవడంతో.. కోళ్ల సంఖ్య పెరగట్లేదు. అందువల్ల గుడ్ల సప్లై తక్కువగా ఉంటోంది. డీజిల్ ధరలు పెరగడంతో.. రవాణా ఖర్చులు భారమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ధరలు పెరుగుతున్నాయి.
కోళ్ల దాణా, కరెంటు, నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతున్నాయని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి.. గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. చిత్రమేంటంటే.. ఇటీవల గుడ్ల సైజ్ తగ్గిపోతోంది. ఒకప్పుడు ఒక్కో గుడ్డు బరువు 60 గ్రాముల దాకా ఉండేది. కానీ ఇప్పుడు.. వాటి బరువు 50 నుంచి 40 గ్రాములే ఉంటోంది. వ్యాపారులేమో.. అవే వస్తున్నాయని అంటున్నారు. ఇలా ధర పెరిగి, సైజ్ తగ్గిపోవడంతో.. ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఏం తినేటట్లు లేదు.. ఏం కొనేటట్లు లేదు అని అనుకుంటున్నారు.
Hyderabad,Telangana

