Last Updated:
Dr Ashok Mahapatra: ప్రముఖ న్యూరోసర్జన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎయిమ్స్ భువనేశ్వర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ మహాపాత్ర (74) కన్నుమూశారు.
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. డాక్టర్ అశోక్ మహాపాత్ర 1952 డిసెంబరు 29న ఒడిశాలోని పూరీ జిల్లాలో జన్మించారు. 2012 నుంచి 2016 వరకు ఆయన భువనేశ్వర్ ఎయిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా సేవలందించారు. ఒడిశా రాష్ట్ర ఆరోగ్యరంగ చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ స్థాపన, అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయన నాయకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సంస్థ నేడు ఒడిశాతో పాటు పొరుగు రాష్ట్రాల వేలాది మంది రోగులకు విశేష సేవలందిస్తోంది.
2016లో కంధమాల్ జిల్లాకు చెందిన అవిభక్త కవలలు జగా, బలియాలను విజయవంతంగా వేరుచేసే సంక్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించి ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వైద్య విజ్ఞానం, ప్రజారోగ్యం, పరిశోధనా రంగాలకు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2024లో ఆయనను దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’తో సత్కరించింది. డాక్టర్ మహాపాత్ర మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్ మహాపాత్ర గొప్ప న్యూరోసర్జన్ అని, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధనా రంగాలకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
డాక్టర్ మహాపాత్ర మరణం ఒడిశా వైద్య రంగానికి మాత్రమే కాక, యావత్ భారత వైద్య రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. భువనేశ్వర్ ఎయిమ్స్‌కు, న్యూరోసర్జరీ విభాగానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

