Last Updated:
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన కలిగించే అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది.
తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్ (కడ్కడ్డూమా) ప్రాంతంలో ఉన్న ఒక కేఫ్‌లో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై ఆమె సహోద్యోగులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి కేఫ్‌లో ఏర్పాటు చేసుకున్న పార్టీ మాటున ఈ అమానుషానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని అరెస్టు చేసి, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పు ఢిల్లీలోని ఒక మాల్లో ఉన్న కేఫ్‌లో బాధితురాలు (22) సహా పలువురు యువతీ యువకులు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి పని ముగిసిన తర్వాత కేఫ్ సిబ్బంది అంతా కలిసి పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కేఫ్ తాళాలు ఒక ఉద్యోగి వద్ద ఉండటంతో, సాధారణ సమయం ముగిసి కేఫ్ మూసివేసిన తర్వాత తిరిగి దానిని తెరిచారు. బాధితురాలితో పాటు మొత్తం ఎనిమిది మంది సిబ్బంది అర్ధరాత్రి వరకు కేఫ్ లోపలే మద్యం సేవిస్తూ పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో ఇద్దరు పురుష సహోద్యోగులు తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ సమయంలో అక్కడే ఉన్న మిగిలిన వారు ఈ దారుణానికి సహకరించారని బాధిత యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.
పార్టీ అనంతరం బాధిత యువతి తన స్నేహితుడు, మరో ఇద్దరు మహిళలతో కలిసి కేఫ్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. కేఫ్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే బాధితురాలు నేరుగా ప్రీత్ విహార్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని మంగళవారం తెల్లవారుజామున ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే అప్రమత్తమైన దిల్లీ పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాన్ని నమోదు చేశారు. యువతి ఇచ్చిన వివరాల ఆధారంగా ఆరుగురిపై సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితులకు సహకరించిన ఇద్దరు మహిళలతో పాటు ఒక యువకుడిని (మొత్తం ముగ్గురిని) పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ప్రధాన నిందితులతో పాటు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పనిచేసే చోటే తోటి ఉద్యోగులు ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం రాజధాని వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

