Last Updated:
Vrushakarma Trailer: అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (వృషాకర్మ). తాజాగా ఈ సినిమా ట్రైలర్ వదలడంతో ఒక్కసారిగా అంచనాలు రెట్టింపయ్యాయి.
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma) థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌బస్టర్ మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన దర్శకుడు కార్తిక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో మొదటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తాజాగా విడుదలైన ట్రైలర్‌ను గమనిస్తే.. ఈ చిత్రాన్ని పురాణాల నేపథ్యం (మైథాలజీ), అతీంద్రియ శక్తుల కలయికతో ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. ట్రైలర్ ఆరంభం నుంచే ఆసక్తికరమైన విజువల్స్, గూస్బంప్స్ తెప్పించే సన్నివేశాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంది. ముఖ్యంగా “మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చబోతున్న ఓ అతీంద్రియ శక్తి.. ఈ భూమిపై తిష్టవేసింది” అనే డైలాగ్ సినిమా కథాంశంపై క్యూరియాసిటీని రెట్టింపు చేస్తోంది. ఈ దుష్ట శక్తిని ఎదుర్కొని మానవాళిని కాపాడేందుకు హీరో చేసే సాహసోపేతమైన పోరాటమే ఈ చిత్ర ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది.
ఇప్పటివరకు లవర్ బాయ్, క్లాస్ ఇమేజ్‌తో అలరించిన నాగచైతన్య, ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని సరికొత్త రగ్డ్ అండ్ ఇంటెన్స్ అవతారంలో కనిపించడం అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి ట్రీట్ ఇస్తోంది. బాపినీడు సమర్పణలో, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌కు చెందిన సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌పై నిర్మించారు.
‘కాంతార’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాలకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించిన అజనీశ్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ట్రైలర్లో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని ఉత్కంఠను మరో స్థాయికి తీసుకెళ్లింది. నిర్మాణ విలువలు, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘విరూపాక్ష’ కాంబినేషన్‌కు నాగచైతన్య తోడవడంతో డిసెంబర్ 4న బాక్సాఫీస్ వద్ద ‘వృషకర్మ’ భారీ వసూళ్లను సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

