Last Updated:
సినిమా అంటే పెద్ద పెద్ద కథలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టార్ హీరోల హంగామా మాత్రమే కాదు. ఒక్కోసారి చిన్న పిల్లల అమాయకత్వం, వాళ్ల చుట్టూ అల్లుకున్న చిన్న చిన్న సంఘటనలు కూడా మనసుకు హత్తుకుంటాయి. అలాంటి ఓ విభిన్నమైన ప్రయత్నమే ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’.
సినిమా అంటే పెద్ద పెద్ద కథలు, భారీ యాక్షన్ సీన్స్, స్టార్ హీరోల హంగామా మాత్రమే కాదు. ఒక్కోసారి చిన్న పిల్లల అమాయకత్వం, వాళ్ల చుట్టూ అల్లుకున్న చిన్న చిన్న సంఘటనలు కూడా మనసుకు హత్తుకుంటాయి. అలాంటి ఓ విభిన్నమైన ప్రయత్నమే ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ. తండ్రి ప్రేమ, చిన్న పిల్లల ప్రపంచం, వాళ్ల భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది? మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందా? అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం…
ఆకాంక్ష (కాజల్ చౌదరి) తన కూతురు పరి (బేబీ పరిణీత)తో కలిసి జీవిస్తుంటుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల పరి ఒంటరిగా మిగిలిపోతుంది. తల్లి జ్ఞాపకాలతోనే కాలం గడుపుతూ, తనకు వచ్చిన స్ట్రింగ్ ఆర్ట్ ప్రతిభతో చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. అమ్మ జ్ఞాపకాలను వదులుకోలేక తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి సమయంలో రాహుల్ (రజత్ రాఘవ్) తనే పరికి తండ్రినంటూ ఆమె జీవితంలోకి వస్తాడు. కానీ అతన్ని తండ్రిగా అంగీకరించడానికి పరి ఇష్టపడదు. ఆమెకు దగ్గరవ్వడానికి రాహుల్ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో బయటపడే గతం, వారి మధ్య ఏర్పడే అనుబంధం చుట్టూ కథ సాగుతుంది.
పిల్లల భావోద్వేగాలు, తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ బంధాలను ప్రధానంగా తీసుకున్న కథ ఇది. ముఖ్యంగా పరి పాత్ర ద్వారా చిన్నపిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు ఎంత విలువ ఇస్తారో చూపించారు. తల్లి జ్ఞాపకాలతో చిన్నారి చేసే ప్రయాణం మనసుకు హత్తుకుంటుంది.
రాహుల్ ఎంట్రీతో కథలో ఆసక్తి పెరుగుతుంది. అతన్ని తండ్రిగా అంగీకరించడానికి పరి నిరాకరించడం, ఆమె మనసు గెలుచుకోవడానికి రాహుల్ చేసే ప్రయత్నాలు కొన్ని చోట్ల నవ్విస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి భాగంలో వచ్చే ట్విస్ట్, తల్లికి సంబంధించిన జ్ఞాపకాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. మరికొన్ని సీన్లను కాస్త కుదించి ఉంటే కథనం మరింత ఆసక్తికరంగా ఉండేది. అయినప్పటికీ సెకండాఫ్, క్లైమాక్స్ సినిమాకు మంచి బలంగా నిలుస్తాయి.
పరి పాత్రలో బేబీ పరిణీత అద్భుతంగా నటించింది. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాహుల్‌గా రజత్ రాఘవ్ సెటిల్డ్ నటనతో మెప్పించారు. కాజల్ చౌదరి తన పాత్రకు న్యాయం చేశారు. హసిని సుధీర్, గుండు సుదర్శన్, ఇతర నటీనటులు తమ పరిధిలో బాగా నటించారు.
ఆర్.హెచ్. విక్రమ్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సన్నివేశాలకు బలాన్నిచ్చాయి. కుశ్వంత్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు శరత్ మంచి భావోద్వేగ కథను ఎంచుకున్నప్పటికీ, కొన్ని సన్నివేశాల్లో కథనాన్ని మరింత బలంగా నడిపించాల్సింది.
ఫైనల్‌గా: తండ్రీకూతుళ్ల అనుబంధం, పిల్లల మనసులోని భావోద్వేగాలను అందంగా చూపించిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. కొన్ని నెమ్మదైన సన్నివేశాలు ఉన్నప్పటికీ, క్లైమాక్స్ మనసుకు హత్తుకుంటుంది. కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా.
రేటింగ్: 3

