Last Updated:
Parliament Special Session: దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక అడుగు వేసింది.
2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే మహిళా కోటాను అమల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో, లోక్‌సభ మరియు అసెంబ్లీల్లో సీట్ల సంఖ్యను 50 శాతం మేర పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి ఈ నెల 30వ తేదీ నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా కొనసాగిస్తూ వచ్చిన ప్రభుత్వం, నవంబర్ 30న లోక్‌సభను, డిసెంబర్ 2న రాజ్యసభను తిరిగి సమావేశపరచాలని విజ్ఞప్తి చేసింది. ఈ ప్రత్యేక భేటీలు డిసెంబర్ 3 లేదా 9వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఉండవని పార్లమెంటు సచివాలయం స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ సమావేశమై ఈ బిల్లులకు సంబంధించిన సవరణలకు తుది ఆమోదం తెలపనుంది.
గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో లోక్‌సభలో అది వీగిపోయింది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలను తొలగించేందుకు, జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలను 50 శాతం చొప్పున పెంచే ఫార్ములాను కేంద్రం తెరపైకి తెచ్చింది.
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల (2/3) మెజార్టీ అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలకు గాను 3 ఖాళీలు ఉండగా, మిగిలిన 539 మంది సభ్యులు హాజరైతే 360 ఓట్లు అవసరమవుతాయి. ఎన్డీయే కూటమికి 319 మంది సభ్యుల బలం ఉండగా, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్), వైకాపా వంటి పార్టీలు మరియు స్వతంత్రుల మద్దతుతో బిల్లు సులభంగా గట్టెక్కుతుందని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు, ఎలాంటి ముందస్తు చర్చ లేకుండా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాటానికి సిద్ధమవుతోంది.

