Last Updated:
Bomb Threat Mumbai: ముంబైలో అమితాబ్ బచ్చన్ ఇల్లు, బాంబే హైకోర్టు, బీఎస్ఈ కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాంబ్ స్క్వాడ్లతో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ముంబై నగరంలో హై అలర్ట్ ప్రకటించారు.
Bomb Threat Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంతో పాటు పలు కీలక ప్రాంతాలను బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాంబే హైకోర్టు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ప్రధాన కార్యాలయం, వర్లీ రేస్‌కోర్స్ లక్ష్యంగా దాడులు చేస్తామని ఆగంతకులు హెచ్చరించడంతో మహారాష్ట్ర భద్రతా వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
బాంబే హైకోర్టుకు శుక్రవారం ఈ బెదిరింపు ఈ-మెయిల్ రాగా, వెంటనే కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ముంబై పోలీసులు వెంటనే భద్రతా సంస్థలను అప్రమత్తం చేసి నగరం అంతటా హై అలర్ట్ ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’ వద్ద బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు బాంబే హైకోర్టు, బీఎస్ఈ ఆవరణలో కూడా పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ బెదిరింపు ఈ-మెయిల్ పంపిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వరుసగా ఇలాంటి బెదిరింపులు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ నటులు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు కూడా ఇలాంటి బెదిరింపులు రాగా, ఇప్పుడు ఏకంగా బిగ్ బి ఇంటికే బాంబు బెదిరింపు రావడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

