Last Updated:
రాజన్న సిరిసిల్లలో వర్షాభావంతో పత్తి, వరి పంటలు ఎండిపోతూ రైతులు అప్పుల బారిన పడుతున్నారు, ఉల్లెందుల పోచయ్యలాంటి రైతులు ట్యాంకర్ నీటిపై ఆధారపడుతూ వరుణుడి కోసం పూజలు చేస్తున్నారు
వర్షాలు కురవాల్సిన సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటంతో రైతుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. పంటలు పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు ఎండకు బీటలు వారుతుండగా, రైతులు చేసిన పెట్టుబడులు కళ్లముందే మట్టిలో కలిసిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలను కాపాడుకోవడానికి రైతన్నలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. అప్పులు చేసి సాగు ప్రారంభించిన రైతులు ఇప్పుడు పంటను బతికించేందుకు మరోసారి భారీ ఖర్చులు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలోని ఇటీవల విలీన గ్రామం అయ్యోరుపల్లికి చెందిన రైతు ఉల్లెందుల పోచయ్య పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలోని వేలాది మంది రైతుల వేదనకు అద్దం పడుతోంది. తన నాలుగు ఎకరాల భూమిలో మే చివరి వారంలో రూ.25 వేల వ్యయంతో పత్తి విత్తనాలు వేశాడు. అయితే తీవ్ర ఎండలు, వర్షాభావం కారణంగా ఆ విత్తనాలు మొలకెత్తకుండానే భూమిలోనే ఎండిపోయాయి. దీంతో మరో మార్గం లేక రెండోసారి మళ్లీ రూ.25 వేల వరకు ఖర్చు చేసి తిరిగి విత్తనాలు వేయాల్సి వచ్చింది.
రెండోసారి వేసిన విత్తనాలు కూడా వర్షాలు లేక ప్రమాదంలో పడటంతో రైతు మరో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే దాదాపు రూ.50 వేల వరకు అప్పుల పాలైన ఆయన, పంటను కాపాడుకోవాలనే ఆశతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పొలాలకు తరలిస్తున్నాడు. ఒక్కో ట్యాంకర్‌కు సుమారు రూ.1,500 చెల్లిస్తుండగా, నాలుగు ఎకరాల పొలానికి ఎనిమిది ట్యాంకర్ల నీరు అవసరమవుతోందని చెబుతున్నారు. పంట కాలువల్లో నీటిని వదులుతూ విత్తనాలను బతికించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
మీడియాతో మాట్లాడిన రైతు ఉల్లెందుల పోచయ్య తన ఆవేదనను వ్యక్తం చేశారు. మొదటిసారి వేసిన విత్తనాలు ఎండిపోవడంతో మళ్లీ అప్పు చేసి విత్తనాలు వేశానని, ఇప్పుడు కూడా వర్షం లేకపోతే రెండోసారి వేసిన పంట కూడా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనలాంటి పరిస్థితిలోనే జిల్లాలోని అనేక మంది రైతులు రెండోసారి విత్తనాలు వేసి అప్పుల ఊబిలో చిక్కుకున్నారని చెప్పారు. వర్షం కోసం ఎదురుచూస్తూనే పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లపై ఆధారపడుతున్నామని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరితో పాటు పత్తి సాగు విస్తృతంగా జరుగుతుంది. అయితే ఈ ఏడాది మే నెలతో పాటు జూన్ నెల కూడా ముగింపు దశకు చేరుకున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. సకాలంలో వర్షాలు పడితేనే పంటలు సమృద్ధిగా పండుతాయని, వ్యవసాయంపై ఆధారపడిన అన్ని రంగాల ఆర్థిక వ్యవస్థ కూడా గాడిలో పడుతుందని గ్రామాల పెద్దలు, రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రైతులందరి చూపు ఒక్కటే… ఎప్పుడు వరుణుడు కరుణిస్తాడా అన్నదానిపైనే నిలిచిపోయింది.
వర్షాల కోసం రైతులు కేవలం ఆకాశం వైపు ఎదురుచూడడమే కాకుండా సంప్రదాయ పూజా కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు నిర్వహించడం, కప్పతల్లి ఆటలు ఆడించడం వంటి సంప్రదాయాలను అనేక గ్రామాల్లో కొనసాగిస్తున్నారు. ప్రకృతి కరుణిస్తేనే రైతు బతుకుతాడు.. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అందుకే ఇప్పుడు తెలంగాణ రైతన్నల మనసులో ఒక్కటే కోరిక.. ఒక మంచి వాన పడాలి.. పొలాలు పచ్చగా మారాలి.
Karimnagar,Telangana
