Last Updated:
RBI Monetary Policy: దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూనే, ఆర్థిక వ్యవస్థ పురోగతికి మద్దతుగా నిలిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. ఈసారి సమీక్షలో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదని, ప్రస్తుతం ఉన్న 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ సవరించకపోవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం. ఈ సంవత్సరం ప్రారంభం నుండి జరిగిన ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ ద్వైమాసిక సమీక్షల్లోనూ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్‌లో జరిగిన సమీక్షల్లోనూ వడ్డీరేట్ల (RBI Interest Rates)ను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, గతేడాది మాత్రం వీటిని పలుమార్లు సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్‌బీఐ.. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఆ తర్వాత డిసెంబరులో మరో పావుశాతం తగ్గించింది. దీంతో గతేడాది మొత్తంగా రెపో రేటు 1.25 శాతం వరకు దిగొచ్చింది. ప్రధాన వడ్డీ రేటును మార్చకుండా యథాతథంగా ఉంచడంతో పాటు, ఆర్‌బీఐ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును 5% వద్దే కొనసాగించింది. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటును, బ్యాంక్ రేటును మార్చకుండా 5.5% వద్ద స్థిరంగా ఉంచింది.
హెడ్‌లైన్ సీపీఐ (CPI) ద్రవ్యోల్బణం తాము ఊహించిన విధంగానే నిర్దేశిత లక్ష్యం కంటే స్వల్పంగా పెరిగిందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తమ విధాన ప్రసంగంలో వెల్లడించారు. ఈ ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధానంగా ఆహారం, ఇంధనం ధరలే కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక (కోర్) ద్రవ్యోల్బణం మాత్రం ఆశాజనకంగా అదుపులోనే కొనసాగుతోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3) హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరి, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఉన్న నమ్మకాన్ని ఉంచుతూ ఆర్‌బీఐ 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY27) జీడీపీ (GDP) వృద్ధి రేటు అంచనాను గతంలో పేర్కొన్న 6.6% నుండి 6.7%కి పెంచింది. అలాగే FY27 తొలి త్రైమాసిక (Q1) జీడీపీ వృద్ధి అంచనాను 6.6% నుండి 7%కి, రెండో త్రైమాసిక (Q2) అంచనాను 6.3% నుండి 6.4%కి సవరించింది. మూడో త్రైమాసికం (Q3) అంచనాను మార్చకుండా 6.5% వద్ద, నాలుగో త్రైమాసికం (Q4) అంచనాను 6.8% వద్దే కొనసాగించింది. ఇది ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంలోనూ ఆర్థిక పురోగతి వేగం బలంగా కొనసాగుతుందని ఆర్‌బీఐ అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేస్తోంది.
Hyderabad,Telangana
Aug 05, 2026 10:10 AM IST

