Last Updated:
చాలా తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇది వేడి అన్నంతో మాత్రమే కాదు.. ఇడ్లీ, దోసె, ఉప్మా, రాగి సంగటి వంటి టిఫిన్లతో కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు.
రోటి పచ్చడి అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని రోటి పచ్చడితో తింటే ఆ రుచే వేరు. అలాంటి పచ్చడుల్లో టమాటా రోటి పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. టమాటాల పులుపు, పచ్చిమిర్చి కారం, వెల్లుల్లి ఘాటు కలిస్తే ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. సాధారణంగా చాలామంది టమాటా పచ్చడిని మిక్సీలో చేసుకుంటారు. కానీ రోట్లో నూరిన టమాటా పచ్చడికి వచ్చే రుచి మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది. ఈ పద్ధతిలో తాలింపు కూడా అవసరం లేదు. చాలా తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇది వేడి అన్నంతో మాత్రమే కాదు.. ఇడ్లీ, దోసె, ఉప్మా, రాగి సంగటి వంటి టిఫిన్లతో కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు.
కావాల్సిన పదార్థాలు: ఒక టేబుల్ స్పూన్ నూనె, 15 పచ్చిమిర్చి, అర కిలో టమాటాలు, నాలుగు చిన్న చింతపండు ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయ, అర కట్ట కొత్తిమీర.
ముందుగా టమాటాలను బాగా కడిగి మధ్యస్థ పరిమాణంలో ముక్కలుగా కోయాలి. మరీ పండిపోయిన టమాటాల కంటే సగం పండిన, కొద్దిగా గట్టిగా ఉన్న టమాటాలు ఉపయోగిస్తే పచ్చడికి మంచి రుచి వస్తుంది. పచ్చిమిర్చి పరిమాణాన్ని మీ ఇంట్లో తినే కారం ప్రకారం తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. పచ్చిమిర్చిని కూడా కడిగి సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత మంటను తక్కువ నుంచి మధ్యస్థ స్థాయిలో ఉంచి టమాటాలు పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించాలి. టమాటాల్లోని నీరు కొంత వరకు ఇంకిపోయి మిశ్రమం చిక్కగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇప్పుడు రోటిని శుభ్రంగా తుడిచి ముందుగా ఉడికించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా నూరాలి. తర్వాత జీలకర్ర వేసి మరోసారి దంచాలి. అనంతరం ఉడికించిన టమాటా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా నూరాలి. చివరగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి ఒకటి రెండు సార్లు మాత్రమే దంచితే సరిపోతుంది. ఇలా చేస్తే ఉల్లిపాయ కరకరలాడుతూ పచ్చడికి ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.
రోట్లో నూరితేనే అసలు సిసలైన గ్రామీణ రుచి వస్తుంది. ఒకవేళ రోలు లేకపోతే మిక్సీ జార్లో టమాటా మిశ్రమం, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర వేసి కేవలం రెండు లేదా మూడు పల్సులు మాత్రమే ఇవ్వాలి. పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు. చివరగా సన్నగా తరిగిన ఉల్లిపాయ కలిపితే కూడా మంచి రుచి వస్తుంది. ఈ టమాటా రోటి పచ్చడిని ఫ్రిజ్‌లో ఒకటి లేదా రెండు రోజులు నిల్వ ఉంచుకుని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో ఒకసారి ఈ విధంగా చేసి చూస్తే, మళ్లీ మళ్లీ ఇదే పద్ధతిలో చేయాలనిపించేంత రుచిగా ఉంటుంది.
Hyderabad,Telangana

