వేములవాడలో నేడు ముగ్గురు మంత్రుల పర్యటన
వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో గురువారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి వారిని మంత్రులు దర్శించుకుంటారు. అనంతరం 8 గంటలకు ఆలయంలో జరిగే వరుణ యాగంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి పాల్గొంటారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం 9 గంటలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. వేములవాడ గుడి చెరువు ట్యాంక్‌బండ్ సుందరీకరణ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూ. 1.60 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.15 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని రగుడు కూడలి వద్ద ‘నేతన్న జోలె (నాడే)’ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సిరిసిల్ల కలెక్టరేట్లో నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేష్ బి.గౌడ్ తెలిపారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సిరిసిల్ల రగుడు జంక్షన్, వేములవాడ ట్యాంక్‌బండ్ పార్క్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాలను ముందస్తుగా పరిశీలించి, అధికారులకు తగిన సూచనలు చేశారు.
