Last Updated:
తెలిసిన వాళ్లే కదా.. ఆపదలో ఉన్నారని నమ్మి సాయం చేసిన ఓ మహిళకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. బంధువుల మాటలు నమ్మి రూ.21 లక్షలు అప్పుగా ఇచ్చిన ఆమె.. డబ్బులు తిరిగి అడగడంతో రుణం చెల్లించడం బదులుగా వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు గురైంది.
తెలిసిన వాళ్లే కదా.. ఆపదలో ఉన్నారని నమ్మి సాయం చేసిన ఓ మహిళకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. బంధువుల మాటలు నమ్మి రూ.21 లక్షలు అప్పుగా ఇచ్చిన ఆమె.. డబ్బులు తిరిగి అడగడంతో రుణం చెల్లించడం బదులుగా వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు గురైంది. న్యూడ్ వీడియో కాల్స్ చేయాలని ఒత్తిడి చేస్తూ, లేకపోతే వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన బాధితురాలు చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. టైలరింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పొదుపుగా వినియోగిస్తూ రొటేషన్ పద్ధతిలో డబ్బులు పెట్టుబడి పెట్టి ఆర్థికంగా ఎదుగుతోంది. ఆమె వద్ద నగదు ఉందని తెలుసుకున్న సమీప బంధువులు చొక్కర అశోక్, వండ్రాసి శంకర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, కొంతకాలానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని నమ్మబలికారు.
బంధువులే కావడంతో వారి మాటలను నమ్మిన మహిళ 2018లో విడతల వారీగా మొత్తం రూ.21 లక్షలను అప్పుగా ఇచ్చింది. అయితే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. పలుమార్లు అడిగినా వివిధ కారణాలు చెబుతూ కాలయాపన చేశారు.
చివరకు డబ్బులు తిరిగి ఇవ్వాలని మహిళ గట్టిగా నిలదీయడంతో, విజయవాడకు వస్తే డబ్బు ఇస్తామని నిందితులు చెప్పారు. వారి మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన బాధితురాలికి షాక్ ఎదురైంది. అక్కడ ఆమెకు తెలియకుండా రికార్డు చేసిన వ్యక్తిగత వీడియోలను చూపించి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించడం ప్రారంభించారు.
అంతటితో ఆగకుండా బాధితురాలి వాట్సాప్‌కు అసభ్యకర వీడియోలు పంపారు. అనంతరం వీడియో కాల్ చేసి, ఆమె కూడా నగ్నంగా వీడియో కాల్ చేయాలని బలవంతం చేశారు. ఒకవేళ అలా చేయకపోతే వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు. బంధువుల చేతిలోనే ఇలా బ్లాక్‌మెయిల్‌కు గురవడంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు లోనైంది.
ఏం చేయాలో అర్థంకాక చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన ఆమె.. జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సేకరించిన ఆధారాల ఆధారంగా చొక్కర అశోక్, వండ్రాసి శంకర్లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారిపై పలు చట్టాల కింద కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు లేదా వీడియో కాల్స్‌ను ఆధారంగా చేసుకుని ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించడం, అసభ్యకర కంటెంట్ పంపించడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలని తెలిపారు. ఇలాంటి బెదిరింపులు ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ముఖ్యంగా మహిళలు, యువతులు ఆర్థిక లావాదేవీలు చేసే సమయంలో బంధువులైనా, పరిచయస్తులైనా పూర్తిగా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వొద్దని, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుని, ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా వెంటనే చట్టపరమైన సహాయం తీసుకోవాలని సూచించారు.
Hyderabad,Telangana

