Last Updated:
కష్టపడి సివిల్స్ కొట్టిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన ఆత్మహత్యకు యత్నించడం మరో ట్విస్టుగా మారింది.
హైదరాబాద్‌లో.. ట్రైనీ మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఎస్సార్‌నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఆత్మహత్య ప్రయత్నానికి ముందు ఉదయ్.. తన వాట్సాప్‌లో ఒక స్టేటస్ పెట్టుకున్నట్లు తెలిసింది. “నాపై కంప్లైంట్,. రూమర్లు నిరాధారమైనవి. నేను చట్టాన్ని నమ్ముతాను. న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. మీడియా వార్తలు ఇచ్చే ముందు కన్ఫామ్ చేసుకోమని అభ్యర్థిస్తున్నాను” అని స్టేటస్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
ఉదయ్ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నట్లు చెబుతున్న కామెంట్
ఈ కేసేంటి?
హైదరాబాద్.. శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో.. కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీసులకు కంప్లైంట్ ఇఛ్చారు. తన సహచర ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై శనివారం, జులై 18న కంప్లైంట్ చెయ్యడంతో ఈ కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ఉదయ్ సూసైడ్ ఎటెంప్ట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
కంప్లైంట్ ప్రకారం, ఉదయ్ కృష్ణారెడ్డి జూన్ 23 నుంచి ఆమె వాట్సాప్‌కి అసభ్యకరమైన, లైంగిక సందేశాలు పంపుతూ వేధించడం ప్రారంభించారు. అకాడమీలో స్నేహితుల ముందు తెలుగులో అమర్యాదకర పదాలు ఉపయోగించి మాట్లాడి.. ఆమె గౌరవాన్ని దెబ్బతీశారు. ఆమెకు తెలుగు రాదు కాబట్టి.. అతను ఏమంటున్నారో ఆమెకు అప్పుడు తెలియలేదు. ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారు. జులై 8న ఆమె మొబైల్ లాక్కొని.. బలవంతంగా పాస్‌వర్డ్ తెలుసుకున్నారు. జులై 9 రాత్రి 9 గంటలకు జుట్టు పట్టుకొని గదిలోకి లాక్కెళ్లి, గొంతు నొక్కి, మెడపై కత్తి పెట్టి బెదిరించారు. ఆమె ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి.. భర్తకు పంపి బ్లాక్‌మెయిల్ చేశారు. ఇవన్నీ ఆమె చేసిన ఆరోపణులు. జులై 10న కూడా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె ఇచ్చిన కంప్లైంట్‌లో ఉంది.
ఈనాడు రిపోర్ట్ ప్రకారం.. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 74, 75, 77, 315(2), ఐటీ యాక్ట్ సెక్షన్ 66E, 67A కింద కేసు రాశారు. దర్యాప్తు మొదలైంది. ఉదయ్ కృష్ణారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అవి అసత్యమనీ, తాను పరువునష్టం కేసు వేస్తానని చెప్పారు. ఆయన ఏపీ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందినవారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ దగ్గర పెరిగాడు. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించారు. 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికై 2018 వరకు సేవ చేశారు. ఒక సీఐ అవమానించడంతో రాజీనామా చేసి.. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యారు. 4 ప్రయత్నాల తర్వాత 5వ సారి 360 ర్యాంకుతో ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. తద్వారా చాలా మందికి ప్రేరణగా నిలిచారు. కానీ ఇప్పుడు ఆయనపై నెగెటివ్ రిమార్క్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన సూసైడ్‌కి ప్రయత్నించడం ఈ కేసులో ట్విస్టుగా మారింది.
Hyderabad,Telangana
Jul 20, 2026 11:22 AM IST

