Last Updated:
ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగుల్లో మహిళలకు మాత్రమే ప్రసూతి సెలవులు అందుబాటులో ఉండేవి. కానీ తమిళనాడు ప్రభుత్వం తాజాగా కొత్త నిర్ణయం తీసుకుంది. భార్యకు ప్రసవం జరిగే సమయంలో పురుష ఉద్యోగులు కూడా కుటుంబంతో ఉండేలా ప్రత్యేక సెలవులను ప్రకటించింది.
తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఇప్పటివరకు మహిళా ఉద్యోగులకు మాత్రమే ప్రసూతి సెలవులు అందుబాటులో ఉండగా.. తాజాగా పురుష ఉద్యోగులకూ పితృత్వ సెలవులు (Paternity Leave) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం తమిళనాడు ప్రభుత్వంలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు వినియోగించుకోవచ్చు. అయితే ఈ సెలవులను తీసుకునేందుకు ప్రభుత్వం రెండు అవకాశాలు కల్పించింది. భార్య ప్రసవానికి 15 రోజుల ముందు నుంచే సెలవులు పెట్టుకోవచ్చు. లేదంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఈ 15 రోజుల సెలవులను ఉపయోగించుకోవచ్చు. దీంతో బిడ్డ జన్మించిన సమయంలో తండ్రి కూడా కుటుంబానికి, తల్లికి తోడుగా ఉండేందుకు వీలవుతుంది.
తమిళనాడు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం 365 రోజుల పాటు ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. ఈ సదుపాయాన్ని గతంలో పలు దశల్లో పెంచుతూ వచ్చారు. మొదట 90 రోజులుగా ఉన్న ప్రసూతి సెలవుల వ్యవధిని 2011లో ఆరు నెలలకు పెంచారు. అనంతరం 2016లో తొమ్మిది నెలలకు, 2021 జూలైలో ఏడాది అంటే 365 రోజులకు పొడిగించారు. అప్పట్లో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే) ప్రభుత్వాల హయాంలో ఈ మార్పులు జరిగాయి.
సాధారణ అర్హత నిబంధనల ప్రకారం ఇద్దరికంటే తక్కువ మంది జీవించి ఉన్న పిల్లలున్న రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు, అనంతరం రాష్ట్రంలో చేసిన సవరణల ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జీవించి ఉన్న పిల్లలున్న మహిళా ఉద్యోగులకు పూర్తి వేతనంతో 12 వారాల ప్రసూతి సెలవులు లభించేవి.
ఈ ఏడాది ఆగస్టులో టీవీకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళా ఉద్యోగులకు కూడా ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 365 రోజులకు పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజాగా పురుష ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

