Last Updated:
Credit Card | దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నా నగదు వాడకం మాత్రం తగ్గడం లేదు. అక్టోబర్‌లో క్రెడిట్ కార్డులతో జరిగిన ఖర్చు డెబిట్ కార్డుల కంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా నమోదైంది. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆర్‌బీఐ తాజా గణాంకాల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
అక్టోబర్‌లో డెబిట్ కార్డులతో పోలిస్తే క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు ఆరు రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు. అయితే, డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడం మాత్రం తగ్గడం లేదు. క్రెడిట్ కార్డుల ఖర్చుకు దాదాపు సమానంగా ఏటీఎంలు, పీఓఎస్ టెర్మినల్స్ ద్వారా నగదు విత్‌డ్రా చేశారు. దీంతో మన రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో డిజిటల్ పేమెంట్స్‌తో పాటు నగదుకు కూడా ఇంకా ప్రాధాన్యం ఉందని స్పష్టమవుతోంది. పీటీఐ కథనం ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన నెలవారీ గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అక్టోబర్ నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా మొత్తం రూ.2.45 లక్షల కోట్ల మేర ఖర్చు చేశారు. అదే సమయంలో డెబిట్ కార్డుల ద్వారా జరిగిన కొనుగోళ్ల విలువ రూ.40,492 కోట్లుగా నమోదైంది. ఇక ఏటీఎంలు, పీఓఎస్ టెర్మినల్స్ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకున్న మొత్తం రూ.2.33 లక్షల కోట్లకు పైగా ఉంది. ఇది క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన ఖర్చు కంటే కొంచెం తక్కువ.
క్రెడిట్ కార్డులతో ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే కొనుగోళ్లు
క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన ఖర్చులో ఎక్కువ భాగం ఆన్‌లైన్ లావాదేవీల నుంచే వచ్చింది. అక్టోబర్‌లో ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1.54 లక్షల కోట్ల మేర కొనుగోళ్లు జరిగాయి. ఇక షాపింగ్ మాల్స్, దుకాణాలు వంటి చోట్ల ఉండే ఫిజికల్ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినల్స్ ద్వారా రూ.90,562 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగాయి. ఇతర క్రెడిట్ కార్డ్ లావాదేవీల విలువ సుమారు రూ.119 కోట్లుగా ఉంది. డెబిట్ కార్డులతో మాత్రం ఎక్కువగా నేరుగా దుకాణాల్లోనే కొనుగోళ్లు చేశారు. పీఓఎస్ టెర్మినల్స్ ద్వారా రూ.24,957 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఆన్‌లైన్ కొనుగోళ్ల విలువ రూ.15,284 కోట్లుగా నమోదైంది. ఇతర డెబిట్ కార్డ్ లావాదేవీల విలువ రూ.251 కోట్లుగా ఉంది.
డెబిట్ కార్డులను ఎక్కువగా నగదు తీసుకోవడానికి ఉపయోగిస్తున్నారని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో ఏటీఎంల ద్వారా డెబిట్ కార్డులతో రూ.2.32 లక్షల కోట్లకు పైగా నగదు విత్‌డ్రా చేశారు. ఈ లావాదేవీలు మొత్తం 42.04 కోట్లుగా నమోదయ్యాయి. మరోవైపు, క్రెడిట్ కార్డులతో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసిన మొత్తం రూ.415 కోట్లుగా ఉంది. డెబిట్ కార్డులను ఉపయోగించి పీఓఎస్ టెర్మినల్స్ ద్వారా నగదు తీసుకున్న మొత్తం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇది సుమారు రూ.1.27 కోట్లుగా నమోదైంది.
ఈ గణాంకాలను గమనిస్తే క్రెడిట్ కార్డులను ప్రధానంగా కొనుగోళ్ల కోసం, ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో డెబిట్ కార్డులను ఎక్కువగా ఏటీఎంల నుంచి నగదు తీసుకోవడానికి వాడుతున్నారు. డెబిట్ కార్డులతో చేసే కొనుగోళ్ల కంటే ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే లావాదేవీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం కార్డ్ పేమెంట్స్, డిజిటల్ లావాదేవీల వినియోగం పెరుగుతున్నప్పటికీ నగదు వాడకం మాత్రం గణనీయంగానే కొనసాగుతోంది. రోజువారీ అవసరాల కోసం ఇప్పటికీ చాలామంది ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. అంటే డిజిటల్ పేమెంట్స్ విస్తరిస్తున్నా, మన ఆర్థిక లావాదేవీల్లో నగదు తన ప్రాధాన్యాన్ని ఇంకా కోల్పోలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

