Last Updated:
PM Modi: అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో దేశ ప్రజలకు చేసిన విజ్ఞప్తి వల్ల లక్షలాది మంది నగల వ్యాపారులు, ఇన్వెస్టర్లు భారీ ఆర్థిక నష్టాల నుంచి బయటపడ్డారని ప్రముఖ వాణిజ్య మండలి ‘ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ (CTI) ప్రశంసించింది.
ప్రధాని ముందుచూపు వల్లే దేశంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయని పేర్కొంటూ సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ తాజాగా ప్రధాని మోదీకి కృతజ్ఞతా లేఖ రాశారు. ప్రధాని మోదీ బంగారం కొనుగోళ్లను నియంత్రించాలని పిలుపునిచ్చిన సమయంలో కిలో బంగారం ధర సుమారు రూ. 1.90 కోట్లుగా ఉండేదని, ప్రస్తుతం అది రూ. 1.25 కోట్లకు దిగివచ్చిందని బ్రిజేష్ గోయల్ వివరించారు. అంటే కిలో బంగారంపై ఏకంగా రూ. 65 లక్షల మేర ధర తగ్గిందని తెలిపారు. ఒకవేళ వ్యాపారులు ఆ సమయంలో ప్రధాని సలహాను పెడచెవిన పెట్టి అధిక ధరలకు బంగారం కొనుగోలు చేసి ఉంటే, ఇప్పుడు కిలోకు రూ. 65 లక్షల చొప్పున నష్టపోయి లక్షలాది మంది నగల వ్యాపారులు అప్పుల ఊబిలో కూరుకుపోయి రోడ్డున పడేవారని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని పిలుపు వల్ల వ్యాపార వర్గాలకు, వినియోగదారులకు కలిగిన ఐదు ప్రధాన ప్రయోజనాలను సీటీఐ తన లేఖలో ప్రస్తావించింది. సాధారణంగా నగల వ్యాపారులు నెలల తరబడి సరిపడా స్టాక్‌ను నిల్వ ఉంచుకుంటారు; పాత అధిక ధరలకు స్టాక్ కొని ఉంటే ఇప్పుడు భారీ నష్టాలు వాటిల్లేవని తెలిపింది. అలాగే ఆన్లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో బంగారం వ్యాపారం చేసే చిన్న వ్యాపారులు, పెట్టుబడిదారులు కూడా భారీ నష్టాల నుంచి తప్పించుకున్నారని పేర్కొంది. తొలుత ప్రధాని సూచనను వ్యతిరేకించిన వారు కూడా ఇప్పుడు దాని ప్రయోజనాలను అంగీకరిస్తున్నారని సీటీఐ వెల్లడించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం సామాన్య కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తోందని సీటీఐ తెలిపింది. ఈ సీజన్లో సుమారు 52 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని, ధరలు దిగిరావడంతో ఆభరణాలు కొనుగోలు చేసే కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందని అభిప్రాయపడింది. బంగారం, వెండి వంటి సున్నితమైన కమోడిటీ మార్కెట్లలో కృత్రిమ కొరత, అక్రమ నిల్వలను అరికట్టేందుకు ప్రధాని ఎప్పటికప్పుడు ఇలాంటి మార్గదర్శకాలు ఇవ్వాలని సీటీఐ విజ్ఞప్తి చేసింది.
అంతకుముందు లక్నోలో జరిగిన 5వ జాతీయ నైపుణ్య స్నాతకోత్సవ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అవసరం లేకపోతే ఏడాది పాటు బంగారం కొనవద్దని తాను చేసిన విజ్ఞప్తికి దేశ ప్రజలు అద్భుతంగా స్పందించారని గుర్తు చేసుకున్నారు. ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించడం వల్లే ధరలు దిగివచ్చాయని, ఇప్పుడు ప్రజలే స్వయంగా “మోదీ జీ.. మీ మాట విని మా డబ్బును ఆదా చేసుకున్నాం” అని చెబుతున్నారని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

