Last Updated:
అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్ అయోధ్య-కాశీ ఉచిత దివ్య దర్శన యాత్రను ప్రారంభించారు. తొలి విడతలో 1,500 మంది భక్తులకు ఉచిత ప్రయాణం, భోజనం, వసతి కల్పిస్తారు.
అనకాపల్లి ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలక హామీని నిలబెట్టుకుంటూ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ అయోధ్య–కాశీ ఉచిత దివ్య దర్శన యాత్రకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో తొలి ప్రత్యేక ఆధ్యాత్మిక రైలును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలి విడతలో 1,500 మంది భక్తులకు పూర్తిగా ఉచితంగా ఈ యాత్రను అందిస్తున్నట్లు ప్రకటించారు. కూటమి నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించామని, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు కూడా అయోధ్యలో శ్రీరాముడు, కాశీలో శ్రీ కాశీ విశ్వనాథుడి దర్శనం కల్పించాలనే సంకల్పంతో ఈ సేవను చేపట్టినట్లు తెలిపారు.
ఐదు రోజుల పాటు కొనసాగే ఈ ఆధ్యాత్మిక యాత్రలో భక్తులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన వివరించారు. ప్రత్యేక రైలులో ప్రయాణం, భోజనం, వసతి, వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ప్రయాణమంతా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక వాలంటీర్లు, వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముందుగా కాశీ విశ్వనాథుని దర్శనం, అనంతరం అయోధ్య రామజన్మభూమి దర్శనం ఉండేలా యాత్ర ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హత కలిగిన భక్తుడికి దశలవారీగా ఈ అవకాశాన్ని కల్పిస్తామని, రెండో విడత ప్రత్యేక రైలును సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఆధ్యాత్మిక సేవలతో పాటు అనకాపల్లి సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎంపీ సి.ఎం. రమేష్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.5 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక పెట్టుబడులను తీసుకురాగలిగామని తెలిపారు. దేశ చరిత్రలోనే ఒకే పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. అనకాపల్లి పేరు అక్షరాల్లోనే కాకుండా అభివృద్ధిలో కూడా దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
రాబోయే రోజుల్లో రైల్వే, రోడ్లు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తామని, అనకాపల్లిని దేశంలోనే ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యత అని పేర్కొన్న ఆయన, దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక యాత్ర విజయవంతం కావడానికి సహకరించిన కూటమి నాయకులు, రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది అందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh

