Last Updated:
మినపప్పుతో తయారుచేసే ఈ లడ్డూలు రుచిగా ఉండటంతో పాటు ప్రోటీన్, పీచుపదార్థాలు వంటి పోషకాలను కూడా అందిస్తాయి. వీటిని పంచదార లేదా బెల్లంతో తయారు చేసుకోవచ్చు. పండుగలు, పూజలు, ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా ఇంట్లోనూ సులభంగా చేసుకోవచ్చు.
సంప్రదాయ తెలుగు స్వీట్లలో సున్నుండలకు ప్రత్యేక స్థానం ఉంది. మినపప్పుతో తయారుచేసే ఈ లడ్డూలు రుచిగా ఉండటంతో పాటు ప్రోటీన్, పీచుపదార్థాలు వంటి పోషకాలను కూడా అందిస్తాయి. వీటిని పంచదార లేదా బెల్లంతో తయారు చేసుకోవచ్చు. పండుగలు, పూజలు, ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా ఇంట్లోనూ సులభంగా చేసుకోవచ్చు. మరి మినపప్పు సున్నుండలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. నీటితో మూడు సార్లు బాగా కడిగి వెంటనే జల్లెడలోకి తీసుకోవాలి. పప్పులోని అదనపు నీటిని తొలగించి శుభ్రమైన పొడి గుడ్డపై పరిచి తేమ లేకుండా తుడవాలి. కావాలంటే ఒక ట్రేలో వేసి ఫ్యాన్ కింద సుమారు 10 నిమిషాలు ఆరబెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పప్పును వేయించేటప్పుడు తేమ కారణంగా ఇబ్బంది ఉండదు.
ఇప్పుడు మందపాటి బాణలిని స్టవ్‌పై పెట్టి మినపప్పు వేసుకోవాలి. మొదట ఐదు నిమిషాలు ఎక్కువ మంటపై కలుపుతూ వేయించాలి. ఆ తర్వాత మంటను మధ్యస్థంగా తగ్గించి మరో రెండు నిమిషాలు వేయించాలి. చివరగా తక్కువ మంటపై మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయించాలి. పప్పు ముదురు బంగారు రంగులోకి మారి మంచి సువాసన వచ్చేవరకు కలుపుతూ ఉండాలి. మాడిపోకుండా జాగ్రత్త పడాలి. అనంతరం స్టవ్ ఆపి పప్పును చల్లారనివ్వాలి.
చల్లారిన మినపప్పును మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గరుకుగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. పంచదార సున్నుండల కోసం గ్రైండర్లో 10 టేబుల్ స్పూన్ల పంచదార, మూడు లేదా నాలుగు యాలకులు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని మినపప్పు పిండిలో వేసి బాగా కలపాలి. బెల్లం సున్నుండలు చేయాలనుకుంటే సుమారు 140 గ్రాముల బెల్లం పొడిని మినపప్పు పిండిలో కలిపి రుబ్బుకోవచ్చు. రుచి చూసి అవసరాన్ని బట్టి బెల్లం మోతాదును సర్దుకోవాలి.
తర్వాత అర కప్పు నెయ్యిని కొద్దిగా వేడి చేసి కరిగించుకోవాలి. మినపప్పు మిశ్రమంలో ముందుగా నాలుగు టీస్పూన్ల నెయ్యి వేసి కలపాలి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా మరింత నెయ్యి కలుపుకోవాలి. మిశ్రమం తడి ఇసుకలా మారినప్పుడు కొద్దిగా చేతిలోకి తీసుకుని గట్టిగా ఒత్తితే లడ్డూ ఆకారం రావాలి. అలా రాకపోతే మరికొంత నెయ్యి కలపాలి. ఎక్కువ నెయ్యి పడితే పొడి మిశ్రమాన్ని కొద్దిగా జోడించాలి.
ఇప్పుడు చేతులతో చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని ప్లేట్లో పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మళ్లీ చేతులతో నెమ్మదిగా గుండ్రంగా చేసుకోవాలి. అంతే.. రుచికరమైన మినపప్పు సున్నుండలు సిద్ధం. వీటిని తేమ తగలకుండా గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. బెల్లంతో చేసిన సున్నుండలను ఒక వారంలో తినేయడం లేదా ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. పంచదారతో చేసినవి గది ఉష్ణోగ్రత వద్ద సుమారు నెల రోజుల వరకు నిల్వ ఉండవచ్చు.

